జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సంగారెడ్డి విద్యార్థిని ఎంపిక
సంగారెడ్డి ; వాలీబాల్ క్రీడలో ప్రతిభ చాటిన సంగారెడ్డికి చెందిన విద్యార్థిని సంటి భావజ్ఞ జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై జిల్లాకు గర్వకారణంగా నిలిచింది. శ్రీ అక్షయ విద్యాలయంలో ఏడో తరగతి చదువుతున్న భావజ్ఞ ఎస్‌జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల్లో తృతీయ బహుమతి సాధించి జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించింది.ఈ సందర్భంగా పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి భావజ్ఞను అభినందించి సత్కరించారు. జాతీయ స్థాయి పోటీల్లోనూ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.జిల్లా ఎస్‌జీఎఫ్ కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థిని కృషి, పట్టుదలతో పాటు తల్లిదండ్రుల ప్రోత్సాహం ఆమె విజయానికి ప్రధాన కారణమని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించాలని శుభాకాంక్షలు తెలిపారు.భావజ్ఞ జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై శ్రీ అక్షయ విద్యాలయ యాజమాన్యం హర్షం వ్యక్తం చేసింది. పాఠశాల కరస్పాండెంట్ వీరప్ప, ప్రిన్సిపాల్ జోషి, వ్యాయామ ఉపాధ్యాయుడు సాయికుమార్‌తో పాటు ఉపాధ్యాయ బృందం విద్యార్థినిని అభినందించి భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.