నాగోల్, పటేల్ చెరువు ఎస్టీపీలు, గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్లను పరిశీలించిన ఎండీ
హైదరాబాద్ మేజర్ న్యూస్ (సిటీ ప్రతినిధి ):హైదరాబాద్ మహానగరంలో శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని మరింత విస్తరించి, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సరఫరాను పెంచేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ అశోక్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సోమవారం నాగోల్, పటేల్ చెరువు మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీలు) సందర్శించిన ఆయన, శుద్ధి జలాల సరఫరా, గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణ, నిర్మాణ రంగంలో శుద్ధి చేసిన నీటి వినియోగంపై అధికారులతో సమీక్షించారు.
నాగోల్ ఎస్టీపీ, గ్రీన్ వాటర్ ఫిల్లింగ్ స్టేషన్ పరిశీలన:
మొదటగా నాగోల్ ఎస్టీపీని సందర్శించిన ఎండీ, అక్కడి గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. జలమండలి ఎయిర్‌టెక్ యంత్రం నిర్వహణ, శుద్ధి చేసిన నీటి వినియోగంపై ఆపరేటర్లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిబ్బందికి తాగునీరు, చేతులు కడుక్కోవడం, ఇతర వ్యక్తిగత శుభ్రత అవసరాల కోసం వేర్వేరుగా ప్రత్యేక నీటి క్యాన్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. సిబ్బందికి అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఎస్టీపీలను తక్కువ సామర్థ్యంతో నిర్వహించకుండా, అందుబాటులో ఉన్న శుద్ధి సామర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. ఇందుకు అవసరమైన ఇంజినీరింగ్ లెక్కలు, విద్యుత్ వినియోగం, నిర్వహణ వ్యయాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
అవసరమైన నిర్మాణ ప్రాంతాల్లో పైప్‌లైన్ అనుసంధాన పనులు చేపట్టడం ద్వారా అదనంగా శుద్ధి జలాలను అందుబాటులోకి తీసుకువచ్చే అవకాశాలను పరిశీలించాలన్నారు. ఇందుకు అవసరమైన పనులు, అంచనా వ్యయం, అమలుకు పట్టే సమయంపై స్పష్టమైన ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు.
పటేల్ చెరువు వద్ద గ్రీన్ వాటర్ ట్యాంకర్ల ప్రారంభం:
అనంతరం పటేల్ చెరువు ఎస్టీపీని సందర్శించిన ఎండీ అశోక్ రెడ్డి, అక్కడి శుద్ధి ప్రక్రియతో పాటు గ్రీన్ వాటర్ ట్యాంకర్ ఫిల్లింగ్ స్టేషన్ నిర్వహణను పరిశీలించారు. శుద్ధి జలాల లభ్యత, ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసే విధానం, నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు.
ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి గ్రీన్ వాటర్ ట్యాంకర్లను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రాంతంలో నిర్మాణ కార్యకలాపాలు చేపడుతున్న సంస్థలు గ్రీన్ వాటర్ ట్యాంకర్ల సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. నిర్మాణ పనులకు తాగునీరు, భూగర్భ జలాలకు బదులుగా శుద్ధి చేసిన నీటిని వినియోగించడం ద్వారా భూగర్భ జలాలపై ఒత్తిడిని తగ్గించవచ్చని పేర్కొన్నారు.
ది వెర్మాంట్ నిర్వాణ హోమ్స్పేసెస్ నిర్మాణ ప్రాంగణం సందర్శన:*
పటేల్ చెరువు ఎస్టీపీ ఫిల్లింగ్ స్టేషన్లో శుద్ధి చేసిన నీటితో నింపిన గ్రీన్ వాటర్ ట్యాంకర్ నిర్మాణ ప్రాంగణానికి చేరుకుంది. టాంకర్ తో పాటు ఎమ్మెల్యేతో కలిసి అక్కడికి వెళ్లిన ఎండీ అశోక్ రెడ్డి, నిర్మాణ పనుల్లో శుద్ధి జలాల వినియోగంపై సంస్థ యాజమాన్యంతో చర్చించారు.
ఒకే ప్రాంతంలో రెండు లేదా అంతకంటే ఎక్కువ భవనాల నిర్మాణాలు దీర్ఘకాలంపాటు కొనసాగుతున్నట్లయితే, ట్యాంకర్లపైనే ఆధారపడకుండా ఎస్టీపీ ఫిల్లింగ్ స్టేషన్ నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నేరుగా శుద్ధి జలాలను సరఫరా చేసుకునే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. దీనివల్ల నిర్మాణ అవసరాలకు నిరంతరాయంగా నీటిని పొందడంతో పాటు ట్యాంకర్లపై ఆధారపడటాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు.
నిర్మాణ రంగానికి ప్రత్యేక పైప్‌లైన్ వ్యవస్థ:*
నగరంలో కనీసం రెండేళ్లపాటు నీటి అవసరాలు ఉండే భారీ నిర్మాణ ప్రాజెక్టులను గుర్తించాలని ఎండీ అధికారులకు సూచించారు. ఆయా ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి సుమారు 300 నుంచి 400 మీటర్ల మేర ప్రత్యేక పైప్లైన్లు ఏర్పాటు చేసే సాంకేతిక సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు.
పైప్‌లైన్ నిర్మాణానికి అయ్యే వ్యయం, సరఫరా సామర్థ్యం, నిర్వహణ అవసరాలతో పాటు భవిష్యత్తులో ఇతర నిర్మాణ ప్రాజెక్టులకు కూడా అదే పైప్‌లైన్‌ను వినియోగించుకునే అవకాశాలపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు.
శుద్ధి జలాల నాణ్యతపై ప్రత్యేక దృష్టి:
నిర్మాణ పనుల్లో కాంక్రీట్ క్యూరింగ్, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్, చెట్ల పెంపకం తదితర అవసరాలకు శుద్ధి చేసిన నీటి వినియోగాన్ని విస్తరించాలని ఎండీ సూచించారు. ఆయా అవసరాలకు అనుగుణంగా నీటి నాణ్యత ప్రమాణాలను నిర్ధారించి, పరీక్షా నివేదికలు, ధ్రువీకరణ పత్రాలను వినియోగదారులకు అందుబాటులో ఉంచాలన్నారు. అవసరమైతే వినియోగదారులు, సరఫరాదారులు నీటి నమూనాలను స్వతంత్రంగా పరీక్షించుకునేందుకు అవకాశం కల్పించాలని సూచించారు.
గ్రీన్ ట్యాంకర్ ఫిల్లింగ్ కేంద్రాల్లో ప్రత్యేక సదుపాయాలు:
గ్రీన్ వాటర్ ట్యాంకర్ల నిర్వహణను మరింత పారదర్శకంగా, సమర్థంగా చేపట్టేందుకు ఫిల్లింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని ఎండీ ఆదేశించారు. కంప్యూటర్, డెస్క్, స్కానర్ తదితర సదుపాయాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్యాంకర్ ఫిల్లింగ్ కేంద్రానికి చేరుకోగానే స్కానింగ్ ద్వారా వాహన వివరాలను నమోదు చేసి, అనంతరం నీటిని నింపుకుని వెళ్లే విధానాన్ని అమలు చేయాలని సూచించారు. ట్యాంకర్ల రాకపోకలు, నీటి సరఫరా వివరాలను ఎప్పటికప్పుడు నమోదు చేసి పర్యవేక్షించాలన్నారు.
శుద్ధి జలాల వినియోగంపై అపోహలు తొలగించాలి:
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో శుద్ధి చేసిన మురుగునీరు తాగడానికి కాకుండా నిర్మాణాలు, గార్డెనింగ్, ల్యాండ్‌స్కేపింగ్, పారిశ్రామిక అవసరాలు తదితర తాగేతర వినియోగాలకు అనువుగా ఉంటుందని ఎండీ అశోక్ రెడ్డి తెలిపారు. ప్రపంచంలోని అనేక దేశాల్లో శుద్ధి చేసిన నీటిని వివిధ అవసరాలకు విజయవంతంగా పునర్వినియోగిస్తున్నారని పేర్కొన్నారు. శుద్ధి చేసిన నీటి నాణ్యతపై ప్రజలు, నిర్మాణ సంస్థలు ఎలాంటి అపోహలకు గురికావద్దని, నిర్దేశిత నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్న నీటిని ఆయా అవసరాలకు నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చని వివరించారు. ఈ విషయంపై ప్రజలకు, నిర్మాణ సంస్థలకు విస్తృత అవగాహన కల్పించి, శుద్ధి జలాల పునర్వినియోగాన్ని ప్రోత్సహించాలని అధికారులను ఆదేశించారు.
శుద్ధి జలాల వినియోగంలో భాగస్వాములు కావాలి:
నిర్మాణాలు, ఉద్యానవనాలు, ఇతర అనుమతించిన తాగేతర అవసరాలకు మాత్రమే వినియోగించేలా అవగాహన కల్పించాలని సూచించారు. నగరంలోని నిర్మాణ సంస్థలు, వాణిజ్య సముదాయాలు, ఉద్యానవనాల నిర్వాహకులు తమ తాగేతర అవసరాలకు జలమండలి అందిస్తున్న గ్రీన్ వాటర్‌ను వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. తాగునీటి సంరక్షణ, భూగర్భ జలాలపై ఒత్తిడి తగ్గింపు, శుద్ధి జలాల పునర్వినియోగంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో జలమండలి సైబరాబాద్ ఈడి పంకజ, జలమండలి డైరెక్టర్ (ఆపరేషన్స్) నారాయణ, సీజీఎంలు నాగేందర్, సుజాత, జీఎంలు, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.