కుషాయిగూడ విస్టా హోమ్స్‌లో ఏరోబిన్ వ్యవస్థ ప్రారంభం
కుషాయిగూడ: నవంబర్ 13 ( మేజర్ న్యూస్)...గృహ వ్యర్థాల నిర్వహణలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంపొందించి, ఇంటి నుంచే సేంద్రియ ఎరువుల తయారీని ప్రోత్సహించే లక్ష్యంతో మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కాప్రా సర్కిల్ పరిధిలోని కుషాయిగూడ విస్టా హోమ్స్‌లో శుక్రవారం ఏరోబిన్ వ్యవస్థను ప్రారంభించారు. మోడరన్ ఆర్కిటెక్ట్స్ ఫర్ రూరల్ ఇండియా (మారి) సంస్థ సహకారంతో చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ పి. రవీందర్ సాగర్ ప్రారంభించారు.
స్వర్ణలత మదర్సన్ ట్రస్ట్ సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ సమన్వయకర్త ప్రేమలత, మారి సంస్థ ప్రతినిధులు పూర్ణచంద్రిక, ధనలక్ష్మి, శ్రీకాంత్, వెంకటేష్, యాకన్న, జ్యోతి, విస్టా హోమ్స్ అధ్యక్షురాలు చిత్రలేఖ, ప్రధాన కార్యదర్శి వీరభద్ర, లక్ష్మీనారాయణ, మున్సిపల్ సిబ్బంది, కాలనీ వాసులు పాల్గొన్నారు.
ఇంట్లోనే సేంద్రియ ఎరువుల తయారీ
ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ రవీందర్ సాగర్ మాట్లాడుతూ.. ఇళ్లలో నిత్యం వెలువడే వంటగది వ్యర్థాలు, ఇతర జీవవిచ్ఛిన్న పదార్థాలను ఏరోబిన్ వ్యవస్థ ద్వారా సేంద్రియ కంపోస్టుగా మార్చుకోవచ్చని తెలిపారు. దీనివల్ల చెత్తను తరలించే భారం తగ్గడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందన్నారు. వ్యర్థాలను సమస్యగా చూడకుండా, వాటిని ఉపయోగకరమైన వనరులుగా మార్చుకోవాలని సూచించారు.
తడి, పొడి చెత్త వేర్వేరుగా ఇవ్వాలి
ప్రతి ఇంట్లో తడి, పొడి వ్యర్థాలను వేర్వేరుగా సేకరించి మున్సిపల్ సిబ్బందికి అందించాలని ఆయన సూచించారు. సాధ్యమైన ప్రతి చోట ఏరోబిన్ వ్యవస్థను వినియోగించుకొని సేంద్రియ వ్యర్థాలను ఇంటి వద్దే ఎరువుగా మార్చుకోవాలన్నారు. పారిశుద్ధ్య నిర్వహణలో ప్రజల భాగస్వామ్యం కీలకమని, ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిస్తే పరిశుభ్రమైన, పచ్చని నగరాన్ని నిర్మించుకోవచ్చని పేర్కొన్నారు.
మున్సిపల్ కార్పొరేషన్ చేపడుతున్న పారిశుద్ధ్య కార్యక్రమాలకు కాలనీవాసులు సహకరించాలని కోరారు. ఇంటి నుంచే వ్యర్థాల వేర్పాటు, సేంద్రియ ఎరువుల తయారీని అలవాటుగా మార్చుకోవాలని పిలుపునిచ్చారు.