పంచాయతీ ఎన్నికల నామినేషన్, పోలింగ్, కౌంటింగ్ కేంద్రాలను పరిశీలించిన ఎస్సై జి. నరేష్
ఆలమూరు మేజర్ న్యూస్ :రానున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ ముందస్తు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఆలమూరు ఎస్సై జి. నరేష్ శనివారం మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి ఎన్నికల నిర్వహణకు ఎంపిక చేసిన కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఆలమూరు పెదపళ్ల, పినపళ్ల, సంధిపూడి, చింతలూరు, సూర్యారావుపేట గ్రామాల్లో ఏర్పాటు చేయనున్న నామినేషన్ కేంద్రాలు, పోలింగ్ స్టేషన్లు, ఓట్ల లెక్కింపు కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. ఆయా కేంద్రాల్లో అందుబాటులో ఉన్న వసతులు, భద్రతా ఏర్పాట్లు, ఎన్నికల నిర్వహణకు అనుకూలమైన పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించారు.ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టాలని, ఓటింగ్ ప్రక్రియ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఎన్నికలు సజావుగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఎస్సై నరేష్ తెలిపారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని పేర్కొన్నారు.