జిల్లా ఆసుపత్రిలో డబ్బులు అడిగితే ఫోన్ చేయండి – ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్
లంచం అడిగితే ఉపేక్షించేది లేదు
సూర్య - పెద్దపల్లి: జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవల కోసం రోగులు, వారి బంధువుల నుంచి ఎవరైనా లంచం డిమాండ్ చేసినా, తీసుకున్నా చట్టరీత్యా నేరమని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కొండ శ్రీధర్ హెచ్చరించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అందించే ఉచిత వైద్య సేవలు, వైద్య పరీక్షలు, చికిత్సల కోసం సిబ్బంది ఎవరైనా డబ్బులు అడిగితే సహించేది లేదని స్పష్టం చేశారు.రోగులు లేదా వారి బంధువులను డబ్బుల కోసం ఇబ్బందులకు గురిచేసే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆసుపత్రిలో ఎవరైనా లంచం అడిగితే భయపడకుండా నేరుగా తన ఫోన్ నంబర్ 8499061999 కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే ప్రతి పేద రోగికి నాణ్యమైన వైద్యం, మెరుగైన వైద్య సేవలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఆసుపత్రిలో పారదర్శకమైన, అవినీతి రహిత వైద్య సేవలు అందించేందుకు అధికారులు, వైద్య సిబ్బంది బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రి సేవలను సద్వినియోగం చేసుకుంటూ అవినీతి నిర్మూలనకు ప్రజలు కూడా సహకరించాలని డాక్టర్ కొండ శ్రీధర్ కోరారు.