ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో ఘనంగా ‘అవెనీర్–2026’ వార్షిక క్రీడోత్సవం
ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఏరోసిటీలో వార్షిక క్రీడోత్సవం ‘అవెనీర్–2026’ శనివారం అట్టహాసంగా నిర్వహించారు. ఐక్యరాజ్యసమితి నిర్దేశించిన సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు (ఎస్ డిజిఎస్) ప్రధాన ఇతివృత్తంగా సాగిన ఈ వేడుకలు క్రీడాస్ఫూర్తి, సృజనాత్మకత, సమిష్టి కృషి, సామాజిక బాధ్యత వంటి విలువలను చాటిచెప్పాయి.
ఈ కార్యక్రమానికి మాజీ భారత ఫుట్బాల్ జట్టు కెప్టెన్, కోచ్, అంతర్జాతీయ క్రీడాకారుడు నయీముద్దీన్ ముఖ్య అతిథిగా, భారత పర్వతారోహకురాలు అన్వితా రెడ్డి గౌరవ అతిథిగా హాజరయ్యారు. కార్యక్రమం విజయవంతం కావాలని పాఠశాల చైర్మన్ మల్కా కొమరయ్య ఆకాంక్షించారు. డైరెక్టర్ పల్లవి, సీఈఓ మల్కా యశస్వి వేడుకల్లో పాల్గొన్నారు.
పాఠశాల ప్రిన్సిపాల్ శరత్ కుమార్ సింగ్ స్వాగత ప్రసంగంతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, పట్టుదల, నాయకత్వ లక్షణాలు, జట్టుగా పనిచేసే నైపుణ్యాలను పెంపొందించడంలో క్రీడలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు. క్రీడోత్సవంలో భాగంగా నిర్వహించిన వివిధ అథ్లెటిక్ పోటీలు విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపాయి. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన జెల్లీఫిష్ ప్రదర్శన, లేజీం నృత్యం, జ్యోతి ప్రదర్శనలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన సమన్వయం, అంకితభావం, కళాత్మక ప్రతిభకు ప్రశంసలు లభించాయి.
క్రీడారంగంలో విశేష ప్రతిభ కనబరిచి విజయాలు సాధించిన విద్యార్థులను ఈ సందర్భంగా ఘనంగా సత్కరించారు. వారి కృషి, విజయాలను అభినందిస్తూ ఇతర విద్యార్థులు కూడా లక్ష్యసాధన దిశగా పట్టుదలతో ముందుకు సాగాలని అతిథులు ఆకాంక్షించారు.
అనంతరం సీఈఓ మల్కా యశస్వి విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక ప్రసంగం చేశారు. క్రీడల్లో రాణించాలంటే ప్రతిభతో పాటు అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల, సానుకూల దృక్పథం అవసరమని తెలిపారు. విజయం సాధించిన విద్యార్థులను అభినందిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
విద్యార్థులు స్వయంగా నిర్వహించిన వ్యాఖ్యానం, క్రీడా వివరణలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వారి వాక్చాతుర్యం, ఆత్మవిశ్వాసం, ఉత్సాహం వేడుకలకు మరింత శోభను తీసుకొచ్చాయి. చివరగా వైస్ ప్రిన్సిపాల్ మాసపేట రాధ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమ విజయానికి సహకరించిన అతిథులు, పాఠశాల యాజమాన్యం, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులకు ధన్యవాదాలు తెలియజేశారు.
సేవే ప్రధాన ఆశయం
అవెనీర్–2026 కేవలం క్రీడా విజయాల వేడుకగా మాత్రమే కాకుండా సమగ్ర విద్య, సుస్థిర అభివృద్ధి, సమానత్వం, సామాజిక సేవ పట్ల పాఠశాలకున్న నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది. ‘స్వార్థం కంటే సేవే మిన్న, అనే సందేశాన్ని చాటిచెబుతూ, విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తితో పాటు సామాజిక బాధ్యతను పెంపొందించేలా ఈ వేడుక సాగింది.
అంకం జగన్ : మేజర్ న్యూస్, జల్ పల్లి.