కడియపులంకలో కోటి దీపోత్సవానికి భారీ ఏర్పాట్లు
ఈ నెల 23న శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు
కడియం ,మేజర్ న్యూస్ :పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని కడియం మండలం కడియపులంక గ్రామంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో ఈ నెల 23వ తేదీ సోమవారం కోటి దీపోత్సవ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ, గ్రామస్తులు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలయ కమిటీ, గ్రామ ప్రజల సహకారంతో ఈ ఆధ్యాత్మిక వేడుకలను నిర్వహిస్తున్నట్లు కమిటీ అధ్యక్షుడు పుల్లా ఆంజనేయులు తెలిపారు.
ఈ సందర్భంగా 23వ తేదీ తెల్లవారుజామున 5 గంటలకు గణపతి హోమంతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయని, అనంతరం హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించనున్నట్లు చెప్పారు. సాయంత్రం 6 గంటలకు కోటి దీపోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం కేరళకు చెందిన శ్రీశ్రీశ్రీ నంబూదిరి స్వామివారి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి విశేష హారతులు సమర్పించనున్నట్లు పేర్కొన్నారు.
రాత్రి 7.30 గంటల నుంచి శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామివార్ల శాంతి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం దీపకాంతులతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనుందని పేర్కొన్నారు.
ఈ పవిత్ర వేడుకలకు భక్తులు, అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి సేవలో పాల్గొనాలని పుల్లా ఆంజనేయులు కోరారు. కార్యక్రమం అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించి దైవానుగ్రహం పొందాలని విజ్ఞప్తి చేశారు.