కలెక్టరేట్‌లో ఉచిత ఆరోగ్య శిబిరం
రంగారెడ్డి: ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన పెంపొందించి, వ్యాధులను ప్రాథమిక దశలోనే గుర్తించేందుకు రంగారెడ్డి జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయాల సముదాయంలో సోమవారం ఆరోగ్య శిబిరం నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కాంటినెంటల్ హాస్పిటల్స్ సహకారంతో ఏర్పాటు చేసిన ఈ శిబిరాన్ని జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి ప్రారంభించారు.
ఈ శిబిరంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల ఆరోగ్య పథకం (EHS) లబ్ధిదారులతో పాటు పలువురు సాధారణ ప్రజలు పాల్గొని వైద్య సేవలు పొందారు. కాంటినెంటల్ హాస్పిటల్స్‌కు చెందిన అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు కార్డియాలజీ, జనరల్ మెడిసిన్, గైనకాలజీ విభాగాల్లో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆరోగ్య సమస్యలతో వచ్చిన వారికి అవసరమైన సలహాలు, సూచనలు అందించారు.
ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ.. ప్రస్తుత జీవనశైలిలో ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తిస్తే సకాలంలో చికిత్స పొందే అవకాశం ఉంటుందని తెలిపారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంతో పాటు ఆరోగ్యంపై అవగాహన కల్పించడమే ఇటువంటి శిబిరాల ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు పేర్కొన్నారు.
వడ్ల శ్రీనివాస్ చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్