ఝరాసంగం మండలాన్ని కరువు మండలంగా గుర్తించడంపై హర్షం
ఝరాసంగం మండలాన్ని కరువు మండలంగా గుర్తించడంపై హర్షం
మంత్రి దామోదర రాజనర్సింహ, ఎంపీ షెట్కార్, ఏ. చంద్రశేఖర్, ఉదయ్ శంకర్ పాటిల్‌కు నవాజ్ రెడ్డి కృతజ్ఞతలు
ఝరాసంగం సూర్య మేజర్ న్యూస్ ః ఝరాసంగం మండలాన్ని కరువు మండలంగా గుర్తించడంపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, కేతకి సంగమేశ్వర దేవస్థానం సభ్యుడు నవాజ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ, జహీరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కార్, జహీరాబాద్ అసెంబ్లీ ఇన్‌చార్జి ఏ. చంద్రశేఖర్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ శంకర్ పాటిల్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
వర్షాభావ పరిస్థితులు, పంటల దిగుబడి తగ్గడం, పెట్టుబడులు కూడా తిరిగి రాని పరిస్థితులతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నవాజ్ రెడ్డి పేర్కొన్నారు. రైతుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని మండలాన్ని కరువు మండలంగా గుర్తించడం ఉపశమనం కలిగించే విషయమని అన్నారు.
కరువు పరిస్థితులతో నష్టపోయిన రైతులకు అర్హత మేరకు పంట నష్టపరిహారం, పంటల బీమా, ఇతర ప్రభుత్వ సహాయ పథకాలను త్వరితగతిన అందించాలని ఆయన కోరారు. రైతులకు ఆర్థిక భరోసా కల్పించి, వ్యవసాయ రంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.