నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
నర్సీపట్నం అక్టోబర్ 28 మేజర్ న్యూస్:అనకాపల్లి జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, నర్సీపట్నం మున్సిపాలిటీ ఎన్నికలు–2026 నేపథ్యంలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించేందుకు మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా నర్సీపట్నం పట్టణంలోని బాలిఘట్టం ప్రాంతం, పీవీఆర్ జంక్షన్ నుండి శాంతినగర్, రామారావుపేట, కొత్తవీధి, గవరవీధి, తురకబడి, కాపువీధి, పాత సంతబయలు, ఎస్సీ కాలనీ, గొర్లివీధి, బ్రాహ్మణవీధి మరియు మసీదు లైన్ ప్రాంతాల్లో పోలీసుల ఆధ్వర్యంలో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.ఈ ఫ్లాగ్ మార్చ్‌లో పోలీస్ ఇన్‌స్పెక్టర్, సబ్‌ఇన్‌స్పెక్టర్లు మరియు ఇతర పోలీస్ సిబ్బంది కలిపి మొత్తం 70 మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్నికల సమయంలో ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందిస్తూ, ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరూ పాటించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని పోలీసులు హెచ్చరించారు. ఎన్నికల సమయంలో అవాంఛనీయ సంఘటనలకు పాల్పడే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో ఎన్నికలు ప్రశాంతంగా, స్వేచ్ఛగా మరియు పారదర్శకంగా జరిగేలా పోలీస్ శాఖ అన్ని ముందస్తు భద్రతా చర్యలు చేపడుతోందని, ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.