తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్
సూర్య డిచ్ పల్లి :నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని జాతీయ రహదారి నంబర్ 44 పై ఇందల్వాయి మండలం చంద్రాయన్‌పల్లి సమీపంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న ప్రాంతాన్ని,నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి . సాయి చైతన్య, ఐపీఎస్., గురువారం పరిశీలించారు. అదే ప్రాంతంలో కొనసాగుతున్న కల్వర్టు నిర్మాణ పనులను తనిఖీ చేసి , ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా ప్రమాదాలు తరచుగా జరుగుతున్న ప్రాంతాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన పోలీస్ కమిషనర్ , నేషనల్ హైవే మేనేజర్ (టెక్) రంగారావు , హైవే కాంట్రాక్టర్ బాల్ రెడ్డితో మాట్లాడి కల్వర్టు నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్మాణ పనుల కారణంగా వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని వివరించారు.అలాగే జాతీయ రహదారిపై వాహనదారులు వేగాన్ని నియంత్రించుకునేలా తగిన ప్రదేశాల్లో స్పష్టమైన సూచిక బోర్డులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు . రాత్రి వేళల్లోనూ వాహనదారులకు ప్రమాదకర ప్రాంతాలు ముందుగానే కనిపించేలా అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. టోల్ ప్లాజా సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ , రహదారిపై ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులతో సమన్వయం చేసుకోవాలని పేర్కొన్నారు.రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ శాఖతో పాటు,జాతీయ రహదారుల నిర్వహణ సంస్థ , కాంట్రాక్టర్లు , టోల్ ప్లాజా సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పోలీస్ కమిషనర్ తెలిపారు.ఈ సందర్బంగా నిజామాబాద్ ఏసీపీ ప్రకాష్ , నేషనల్ హైవే మేనేజర్ రంగారావు , హైవే కాంట్రాక్టర్ బాల్ రెడ్డి , స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మలేష్ , డిచ్‌పల్లి సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కె. వినోద్ , ఇందల్వాయి ఎస్ఐ సుమలత , ఇందల్వాయి సర్పంచ్ రఘు , టోల్ ప్లాజా సిబ్బంది , వీరబాబు తదితరులు పాల్గొన్నారు.