కలల ఇల్లు కట్టుకున్నాడు.. గృహప్రవేశం మరుసటి రోజే కన్నుమూశాడు
మేడివాడలో తీరని విషాదం
రావికమతం (మేజర్ న్యూస్):, కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన ఆనందంలో ఉండగానే.. ఆ ఇంటి యజమాని శాశ్వతంగా ఆ ఇంటికి దూరమయ్యాడు. మేడివాడలో గురువారం జరిగిన ఈ దుర్ఘటన ప్రతి ఒక్కరి హృదయాన్ని కలచివేస్తోంది.మేడివాడ మెయిన్ రోడ్ లో పెద్దేరు రిజర్వాయర్ కాలువ పక్కన నివసిస్తున్న మలసాల స్వామినాయుడు (42). ఎన్నో ఏళ్లుగా కష్టపడి, పైసా పైసా కూడబెట్టి తన పాత ఇంటిపై రెండో అంతస్తు వేశాడు. "కొత్త ఇల్లు కట్టాను రండి" అంటూ బంధువులందరినీ పిలిచాడు.బుధవారం రాత్రి. వేద మంత్రాల నడుమ అత్యంత సంతోషంగా గృహప్రవేశం చేశాడు. ఇల్లంతా సందడి. గురువారం బంధువులకు విందు. కోలాహాలంగా ఉన్న నేపథ్యంలో
ఊహించని ప్రమాదం. తుఫాన్ వల్ల కొత్త గోడలు ఇంకా తడిగా ఉండటంతో, ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు యజమాని గురయ్యాడు.రావికమతం ఆసుపత్రికి, అక్కడి నుంచి నర్సీపట్నంకు పరుగులు తీశారు. కానీ విధి అంతకంటే వేగంగా పరుగెత్తింది.నిన్నటి వరకు గృహప్రవేశం పిలుపు పంచిన చేతులు.. ఇవాళ అచేతనంగా మారిపోయాయి. కొత్త ఇంటి గోడలపై వేసిన తోరణాలు ఇంకా వాడిపోలేదు.. అప్పుడే ఆ ఇంటి ముందు కన్నీటి తోరణాలు.కష్టపడి నిర్మించుకున్న ఇంటిలో ఒక్క రోజు కూడా పూర్తిగా ఉండకుండానే అనంత లోకాలకు వెళ్లిన భర్తను తలుచుకొని భార్య చెంచులక్ష్మి బోరున విలపిస్తుంది. ఈ ఘటన గ్రామస్తులు అందరిని తీవ్రంగా కలిచి వేసింది