జహీరాబాద్ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో మూడు రోజుల ఆధ్యాత్మిక మహోత్సవం!
జహీరాబాద్, ; జహీరాబాద్ పట్టణంలోని శ్రీ మంగళ గౌరీ సమేత శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానంలో అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1వ తేదీ వరకు మూడు రోజుల పాటు ప్రత్యేక ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలకు ఉజ్జయిని జగద్గురువులతో పాటు వివిధ మఠాలకు చెందిన పీఠాధిపతులు, శివాచార్య మహాస్వాములు హాజరుకానున్నారు.
అక్టోబర్ 30న ప్రత్యేక పూజలు, లింగదీక్ష.
ఈ నెల 30వ తేదీన గణపతి పూజ, పంచాచార్య, అష్టదిక్పాలక పూజలు, నవగ్రహాది సర్వదేవతా హవనాలు నిర్వహించనున్నారు. అనంతరం శ్రీ శ్రీ శ్రీ 108 వీరేశ్వర శివాచార్య మహాస్వాముల చేతుల మీదుగా అయ్యాచార లింగదీక్ష, మంత్రోపదేశ కార్యక్రమం జరగనుంది.
31న ఆరుద్రోత్సవం.
అక్టోబర్ 31వ తేదీన సంగారెడ్డి జిల్లా రాష్ట్ర అర్చక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆరుద్రోత్సవ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
నవంబర్ 1న జగద్గురువుల రథోత్సవం.
నవంబర్ 1వ తేదీన ఉదయం 8 గంటలకు శ్రీమద్ 1008 ఉజ్జయిని జగద్గురువుల రథోత్సవ ఊరేగింపు నిర్వహించనున్నారు. స్థానిక రాచన్న మఠం నుంచి శ్రీ సిద్ధేశ్వర స్వామి దేవస్థానం వరకు ఈ ఊరేగింపు కొనసాగనుంది. అనంతరం జగద్గురువుల చేతుల మీదుగా స్వామివారికి అభిషేకం, ఇష్టలింగ మహాపూజ, లక్ష బిల్వార్చన, పాదపూజ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.ఉదయం 11.30 గంటలకు ముఖ్య వక్తల ప్రవచనాలు, శివాచార్యుల అనుగ్రహ భాషణాలు, జగద్గురువుల అమృత ఆశీర్వచనాలు, మంగళహారతి, తీర్థప్రసాద వితరణ కార్యక్రమాలు జరగనున్నాయి.
పలువురు పీఠాధిపతుల దివ్య సాన్నిధ్యం.
ఈ ఆధ్యాత్మిక వేడుకలకు కర్ణాటక, మధ్యప్రదేశ్ సద్ధర్మ సింహాసన మహాసంస్థాన పీఠానికి చెందిన శ్రీమద్ ఉజ్జయిని సద్ధర్మ సింహనాదీశ్వర శ్రీ శ్రీ శ్రీ 1008 జగద్గురు సిద్ధం లింగరాజ దేశీకేంద్ర శివాచార్య భగవత్పాద మహాస్వాములు దివ్య సాన్నిధ్యం వహించనున్నారు.బిచ్కుంద సంస్థాన మఠం శ్రీ 108 సోమలింగ శివాచార్య మహాస్వాములవారు నేతృత్వం వహించనుండగా, మొగుడంపల్లి మండలం ధనసిరి హీరేమఠం పీఠాధిపతి శ్రీ 108 వీరేశ్వర శివాచార్య మహాస్వాములవారి పర్యవేక్షణలో కార్యక్రమాలు కొనసాగనున్నాయి.వీరితో పాటు తంగడపల్లి శివయోగి శివాచార్య మహాస్వామి, బర్దిపూర్ వైరాగ్య శిఖామణి శ్రీ అవధూతగిరి మహారాజ్, రంజోల్ శ్రీ మఠం రాచయ్య స్వామి, న్యామతాబాద్ శ్రీ సిద్ధయ్య స్వామి తదితరులు పాల్గొననున్నారు.ఈ మూడు రోజుల ఆధ్యాత్మిక కార్యక్రమాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరై శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆలయ నిర్వాహకులు కోరారు. వేడుకల నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నట్లు తాలూకా, పట్టణ జంగమ సమాజం, జిల్లా అర్చక సంఘం, వీరశైవ సమాజం సభ్యులు తెలిపారు
.