telangana
ఇండియన్ రెడ్‌క్రాస్ సేవలను మరింత విస్తరించాలి - జిల్లా కలెక్టర్ రాజర్షి షా
సూర్య ఆదిలాబాద్ ప్రతినిధి : జిల్లాలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ సేవలను మరింత విస్తృతం చేసి, నిరుపేదలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా సూచించారు. మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా కార్యవర్గ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో పలు కీలక సూచనలు చేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రాష్ట్ర గవర్నర్ సూచనల మేరకు చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని గిరిజన గ్రామాల్లో నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేయాలని ఆదేశించారు. డిసెంబరులో ప్రత్యేక రక్తదాన శిబిరం నిర్వహించి, జిల్లాలోని బ్లడ్ బ్యాంకుల్లో రక్త నిల్వలు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెడ్‌క్రాస్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు విస్తరించి, రక్తదానం, ఆరోగ్య సేవలు, విపత్తుల సమయంలో సహాయక చర్యల్లో యువత, ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు.జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థల్లో జూనియర్ రెడ్‌క్రాస్, యూత్ రెడ్‌క్రాస్ వాలంటీర్ల నమోదును విస్తృతంగా చేపట్టాలని కలెక్టర్ తెలిపారు. నవంబర్ 14 నుంచి డిసెంబర్ 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రత్యేక నమోదు కార్యక్రమంలో విద్యార్థులు, యువత అధిక సంఖ్యలో భాగస్వాములు కావాలన్నారు.14 నుంచి 18 ఏళ్ల వయస్సు గల పాఠశాల విద్యార్థులు జూనియర్ రెడ్‌క్రాస్‌లో, 18 నుంచి 30 ఏళ్ల యువత యూత్ రెడ్‌క్రాస్‌లో సభ్యులుగా చేరవచ్చని తెలిపారు. ఎన్‌ఎస్‌ఎస్, ఎన్‌సీసీ, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు ఈ కార్యక్రమంలో భాగస్వాములై సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఆసక్తి గల విద్యార్థులు, యువత www.redcross.cgg.gov.in వెబ్‌సైట్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు.నషా ముక్త్ భారత్ అభియాన్’లో భాగంగా మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు, పోటీలు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి, జనవరి 12, 2027న లోక్‌భవన్‌లో గవర్నర్‌తో జరిగే కార్యక్రమంలో పాల్గొనేలా చూడాలన్నారు. విద్యార్థుల ఎంపిక బాధ్యతలను డీఈవో, డీఐఈవో, ప్రాంతీయ సంచాలకులు సమన్వయంతో చేపట్టాలని ఆదేశించారు. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రచారం, రక్తదాన అవగాహన, ప్రథమ చికిత్స, విపత్తులపై సన్నద్ధత, పర్యావరణ పరిరక్షణ తదితర సేవా కార్యక్రమాల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యాసంస్థలకు ‘రెడ్‌క్రాస్ లోక్‌భవన్ స్వామి వివేకానంద యూత్ అవార్డ్స్–2026’ అందించనున్నట్లు తెలిపారు. జనవరి 12న గవర్నర్ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేయనున్నట్లు పేర్కొన్నారు.రెడ్‌క్రాస్ పాత భవనానికి అవసరమైన మరమ్మతులను తక్షణమే చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. పట్టణంలో ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీకి కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన చర్యలు వేగవంతం చేయాలన్నారు. సంస్థ సేవలను మరింత బలోపేతం చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.ఈ సమావేశంలో రెడ్‌క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ ఆర్. క్రాంతి కుమార్, వైస్ చైర్మన్ మనోహర్, సభ్యులు కె. పార్థసారథి, సంజీవరావు, రాజు, రూపేష్ రెడ్డి, ఉషా విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.