telangana
కార్మికుల భద్రతకు సింగరేణి పెద్దపీట - ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. నిరోష
సూర్య నస్పూర్ : భూగర్భ గనుల్లో పనిచేస్తున్న కార్మికుల భద్రతకు సింగరేణి యాజమాన్యం ఇస్తున్న ప్రాధాన్యత అభినందనీయమని మంచిర్యాల జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. నిరోష అన్నారు. మంగళవారం శ్రీరాంపూర్ ఏరియాలోని ఆర్కే 7 భూగర్భ గనిని సందర్శించి, అధికారులతో కలిసి బొగ్గు ఉత్పత్తి, కార్మికుల పనితీరు, భద్రతా చర్యలను పరిశీలించారు.దేశానికి వెలుగులు అందించేందుకు కార్మికులు చీకటిలో పడుతున్న కష్టాన్ని ప్రత్యక్షంగా చూడటం ప్రత్యేక అనుభూతినిచ్చిందన్నారు. క్లిష్ట పరిస్థితుల్లో పనిచేస్తున్న కార్మికుల రక్షణకు యాజమాన్యం తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. సింగరేణి సంస్థ మరింత అభివృద్ధి సాధించి, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గని మేనేజర్ జె. తిరుపతి, డిప్యూటీ మేనేజర్ వెంకట్రామ్, సీనియర్ పీఓ సంతన్ తదితరులు పాల్గొన్నారు.