కలెక్టరేట్ గ్రంథాలయానికి 75 పుస్తకాల వితరణ
బాపట్ల, మేజర్‌న్యూస్:
బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గ్రంథాలయానికి దాతల సహకారంతో సేకరించిన 75 వివిధ రకాల పుస్తకాలను మంగళవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్‌కు అందజేశారు. హైదరాబాద్‌కు చెందిన స్వచ్ఛ మానస్ సేవా ట్రస్ట్ (నేరెళ్ల కోటేశ్వరరావు) ద్వారా 50 పుస్తకాలు, మానవత సంస్థ సాంస్కృతిక విభాగ ప్రతినిధి డాక్టర్ బి. సింగారావు ద్వారా 18 పుస్తకాలు, బాపట్ల మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షులు గురజాల శ్రీనివాసరావు తరఫున 5 పోటీ పరీక్షల పుస్తకాలు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కోటా వెంకటేశ్వర్ రెడ్డి అందించిన 2 పుస్తకాలను సేకరించి ఈ వితరణ చేపట్టారు. ఈ సందర్భంగా ముత్తాయపాలెం ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మానవతా సంస్థ అధ్యక్షులు గురజాల శ్రీనివాసరావు మాట్లాడుతూ... కలెక్టర్ చొరవతో కార్యాలయంలో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. సామాజిక, సాంస్కృతిక పుస్తకాలతో పాటు పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను అందజేశామని, భవిష్యత్తులోనూ గ్రంథాలయ అభివృద్ధికి మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పూర్తి సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంస్థ చైర్మన్ డాక్టర్ బి శరత్ బోస్, సంస్థ వైస్ చైర్మన్ తోట రామాంజనేయులు, జాయింట్ సెక్రటరీ ఎం. జ్యోతిర్మయి, సభ్యులు డాక్టర్ ఐ. శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.