గ్రామీణ ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు -కూచుకుళ్ల రామచంద్రారెడ్డి ఐ సెంటర్ 28వ వార్షికోత్సవ వేడుకల్లో ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, -మారుమూల ప్రాంతాల్లో నేత్ర వైద్య సేవలు అందించడం అభినందనీయం, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలను చేరువ చేయడానికి కూచుకుళ్ల రామచంద్రారెడ్డి ఐ సెంటర్ ను తూడుకుర్తి గ్రామంలో నెలకొల్పి ప్రజల మన్ననలు పొందేలా ఎల్వీ ప్రసాద్ భాగ్యస్వామ్యంతో అహర్నిశలు అందిస్తుందని, ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి అన్నారు.గత 28 ఏళ్లుగా ప్రజలకు నేత్ర వైద్య సేవలు అందిస్తున్న సంస్థ మరింత అభివృద్ధి చెందాలని అయన ఆకాంక్షించారు. నాగర్‌కర్నూల్ మండల పరిధిలోని తూడుకుర్తిలో శనివారం ఎల్‌వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌కు అనుబంధంగా నిర్వహిస్తున్న కూచుకుళ్ల రామచంద్రారెడ్డి ఐ సెంటర్ 28వ వార్షికోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్ రెడ్డి మాట్లాడుతూ..గ్రామీణ మారుమూల ప్రాంతాల ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలను అందుబాటులోకి తీసుకు రావడంలో ఐ సెంటర్ కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. కంటి సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా సకాలంలో నేత్ర పరీక్షలు చేయించుకుని, అవసరమైన చికిత్స పొందేలా అవగాహన కల్పించాలని సూచించారు.
తన తండ్రి పేరుతో నిర్వహిస్తున్న నేత్ర వైద్య కేంద్రం ద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరడం సంతృప్తినిస్తోందని ఎమ్మెల్సీ తెలిపారు. సంస్థ తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించి, ఎక్కువ మంది ప్రజలకు నాణ్యమైన నేత్ర వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ మాట్లాడుతూ. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన నేత్రదానం అందించేందుకు ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డి గారు చూపిన చొరవతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన సేవలు అందుతున్నాయని కలెక్టర్ కొనియాడారు. ప్రతి మనిషి జీవితంలో కంటి చూపు ఎంతో విలువైనదని అన్నారు. దృష్టి సమస్యలు వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ, సామాజిక జీవితాలపైనా ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. కంటి సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా నేత్ర పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ముందస్తు పరీక్షల ద్వారా కంటి వ్యాధులను తొలి దశలోనే గుర్తించి, సకాలంలో తగిన చికిత్స పొందవచ్చని తెలిపారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో వైద్య సేవలు అందుబాటులో లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితుల్లో ఇటువంటి నేత్ర వైద్య కేంద్రాలు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. వైద్య సేవలు అందించడంతో పాటు కంటి ఆరోగ్యంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తున్న వైద్యులు, సిబ్బంది సేవలు అభినందనీయమని పేర్కొన్నారు. సేవాభావంతో పనిచేస్తున్న వైద్య సంస్థలు తమ సేవలను మరింత విస్తరించి, ఎక్కువ మంది ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు.
అనంతరం ఉత్తమ సేవలు అందించిన ఉద్యోగిని ఎంపిక చేసి నగదు బహుమతితో పాటు ప్రశంసాపత్రాన్ని అందజేశారు.కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర, తహసిల్దార్ తబితా రాణి, గ్రామ సర్పంచ్ లక్ష్మి, కరుణాకర్ రెడ్డి, ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రముఖులు పాల్గొన్నారు.
పి. వినయ్ కుమార్, నాగర్ కర్నూల్ క్రైమ్, సూర్య న్యూస్