గడువులోగా భూ రీ-సర్వే పూర్తి చేయాలి మల్కాపూర్‌లో సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్
సూర్య- పెద్దపల్లి: భూ రీ-సర్వే ప్రక్రియను ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. సోమవారం రామగుండం మండలం మల్కాపూర్ గ్రామంలో జరుగుతున్న భూ రీ-సర్వే పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పురోగతిని సమీక్షించారు. మల్కాపూర్‌లో సర్వేను ఈ వారాంతంలోగా పూర్తి చేయాలని సూచించారు. అల్లూరు గ్రామానికి కో-రిలేషన్ స్టేట్‌మెంట్ సిద్ధం చేయాలని, మల్యాలపల్లిలో త్వరగా సర్వే ప్రారంభించాలని ఆదేశించారు. జంగావ్ గ్రామంలో నవంబర్ నెలాఖరులోగా రీ-సర్వే పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సర్వే సమయంలో భూముల హద్దులు, విస్తీర్ణం, సర్వే నంబర్లను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా చూడాలన్నారు. భూ యజమానుల సమక్షంలో సర్వే నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ రాజేశ్వర్, సంబంధిత అధికారులు, సర్వే సిబ్బంది పాల్గొన్నారు.