ఈవీఎం గోడౌన్‌ను తనిఖీ చేసిన కలెక్టర్
రంగారెడ్డి : రాజేంద్రనగర్‌లోని ఈవీఎం (ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లు) గోడౌన్‌ను జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డి మంగళవారం తనిఖీ చేశారు. సాధారణ నెలవారీ పరిశీలనలో భాగంగా గోడౌన్‌ను సందర్శించిన ఆయన, అక్కడి భద్రతా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ముందుగా గోడౌన్‌కు ఏర్పాటు చేసిన సీల్స్‌ను తనిఖీ చేసి, ఈవీఎంల భద్రత, నిల్వ, పరిరక్షణకు తీసుకుంటున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీప్యాట్ యంత్రాలతో పాటు ఇతర ఎన్నికల సామగ్రిని భద్రపరిచిన తీరును పరిశీలించారు. గోడౌన్‌లో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల పనితీరును సమీక్షించి, నిరంతరం పర్యవేక్షణ కొనసాగించాలని సూచించారు.
అనంతరం గోడౌన్ వద్ద ఏర్పాటు చేసిన పోలీసు బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఎన్నికల సామగ్రి భద్రత విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. విధుల నిర్వహణలో ఎలాంటి నిర్లక్ష్యానికి తావివ్వకుండా పటిష్టమైన భద్రతా చర్యలు కొనసాగించాలని స్పష్టం చేశారు.
ఈ తనిఖీలో రాజేంద్రనగర్ ఆర్డీఓ శ్రీధర్, తహశీల్దార్, వేర్‌హౌస్ ఇన్‌చార్జి రాములు, ఎన్నికల విభాగం అధికారులు రవీంద్ర గుప్తా, పోలీసు అధికారులు, సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.
వడ్ల శ్రీనివాస చారి, రంగారెడ్డి, మేజర్ న్యూస్, (నవంబర్ 10)