ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి
ప్రభుత్వ ఆసుపత్రిలో మెరుగైన వైద్య సేవలు అందించాలి
రాత్రి వేళలో వైద్య అధికారులు ఆసుపత్రిలో అందుబాటులో ఉండాలి
ప్రభుత్వ ఆస్పత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన సర్పంచ్, ఉప సర్పంచ్
లింగాల, సూర్య న్యూస్:
మండల కేంద్రమైన లింగాలలోని ప్రభుత్వ ఆసుపత్రినీ సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, ఉప సర్పంచ్ నాయకపు వీరాస్వామి ఆధ్వర్యంలో యువకులు, వివిధ వార్డుల సభ్యులు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ నిర్వహించి ప్రజలకు అందుతున్న వైద్య సేవల గురించి ఆరా తీశారు. ఆసుపత్రిలోని వివిధ కంపార్ట్మెంట్లను పరిశీలించారు. ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, మౌలిక వసతులు, రోగులకు అందుతున్న సేవలు గురించి సూపర్డెంట్ డాక్టర్ మురళి తో పాటు సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయా, అవసరమైన వసతులు సక్రమంగా ఉన్నాయా అని ఆసుపత్రికి వచ్చిన రోగులను అడిగి ఆరా తీశారు.ఆసుపత్రిలో వైద్యులు, నర్సింగ్ సిబ్బంది సమయపాలన పాటిస్తున్నారా లేదా అనే అంశాన్ని పరిశీలించారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న తీరును సమీక్షించారు. ఆసుపత్రిలో వైద్యులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండాలని, సిబ్బంది తమ సేవలను మరింత మెరుగుపరచుకోవాలని, అలాగే ఆసుపత్రి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని పలు విలువైన సూచనలు అందజేశారు.
ఫార్మసీలో మందులు, ఇంజెక్షన్లు ఎప్పుడూ సరిపడా ఉండేలా చూసుకోవడంతో పాటు, రోగుల సౌకర్యార్థం బెడ్ల ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. నల్లమల అటవీ ప్రాంతంలోని మారుమూల గిరిజన ప్రాంతమైన లింగాల మండలంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడంతోపాటు, ఆసుపత్రిల అవసరమైన సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు. ఇకపై ఆసుపత్రిలో అన్ని సదుపాయాలు సక్రమంగా అందేలా, డాక్టర్లు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా, ముఖ్యంగా రాత్రి వేళల్లో కూడా వైద్యులు ఆసుపత్రిలోనే ఉండేలా తగిన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా సూపర్డెంట్ డాక్టర్ మురళి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పూజారీ ఈశ్వరమ్మ బుడ్డయ్య, ఉపసర్పంచ్ నాయకపు వీరస్వామి, వివిధ వార్డుల సభ్యులు,వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.