పెన్నా నదిని కాలుష్య రహితంగా ఉంచాలి
నెల్లూరు, కలెక్టరేట్, మేజర్ న్యూస్ : పెన్నా నదిని, డంప్‌సైట్ పరిసర ప్రాంతాలను కాలుష్య రహితంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ డా. పి. కృష్ణయ్య అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన ఆళ్లిపురం డంప్‌సైట్‌ను సందర్శించి అక్కడి పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. డంప్‌సైట్‌లో పెద్దఎత్తున పేరుకుపోయిన చెత్త, నీటి నిల్వలు, అపరిశుభ్ర వాతావరణంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. వెంటనే వ్యర్థాలను తొలగించి ప్రాంగణాన్ని శుభ్రం చేయాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. చెత్త గాలికి చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించకుండా తగిన ఏర్పాట్లు చేయాలని, చెత్త సేకరించే కార్మికులు వ్యర్థాలను రోడ్లపై వేయకుండా డంప్‌సైట్‌లోనే ప్రత్యేక ప్రాంతంలో నిల్వ చేయాలని ఆదేశించారు. అనంతరం పెన్నా నది పరిసర ప్రాంతాలను పరిశీలించిన ఆయన, నదిలో ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను పడవేయడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికే పేరుకుపోయిన చెత్తను తొలగించి, శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహించాలని సూచించారు. నది పరివాహక ప్రాంతంలో నిర్మాణ, కూల్చివేత వ్యర్థాలను అక్రమంగా పారవేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పెన్నా నది ప్రవాహానికి, పర్యావరణానికి నష్టం కలగకుండా నది పరివాహక ప్రాంతంలో వ్యర్థాల పారవేతను అరికట్టాలని రివర్ కన్జర్వేటర్, ఇరిగేషన్ అధికారులకు సూచించారు. నిషేధిత ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తులు, సంస్థలకు జరిమానాలు విధించడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డంప్‌సైట్‌లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, దోమలు, వ్యాధికారక క్రిములు పెరగకుండా నిరంతరం పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ప్రజారోగ్యం, పర్యావరణ పరిరక్షణకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో ఏపీపీసీబీ నెల్లూరు ప్రాంతీయ అధికారి అశోక్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.