విశాఖలో 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' మెగా క్రికెట్ హంగామా
విశాఖపట్నం, సూర్య : నగరంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, వ్యవస్థాపకులు, వివిధ రంగాల నిపుణులను క్రీడా ఉత్సాహంతో ఒకే వేదికపైకి తీసుకువచ్చేందుకు 'ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్' ఎఫ్ సీ ఎల్ ప్రీమియర్ క్రికెట్ లీగ్ సీజన్-4 ఘనంగా సిద్ధమైంది. నగరంలోనే అత్యంత ఆదరణ పొందిన బిజినెస్ కమ్యూనిటీ టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంట్‌గా గుర్తింపు పొందిన ఈ లీగ్ అధికారిక ఫ్రాంచైజ్ వేలం పాట, జెర్సీ మరియు ట్రోఫీ ఆవిష్కరణ కార్యక్రమం స్థానిక బీచ్ రోడ్డులోని గాదిరాజు ప్యాలెస్‌లో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఫ్రెండ్స్ క్రికెట్ లీగ్ వ్యవస్థాపకులు కరణ్ అశోక్ కుమార్, ప్రధాన స్పాన్సర్ గౌమయ పెయింట్స్ అధినేత డాక్టర్ మురళీ, స్వామి,హైఫై ఎంటర్‌టైన్‌మెంట్ ఈవెంట్ మేనేజర్ సందీప్ కుమార్, కోర్ కమిటీ సభ్యులు భార్గవ్ పాల్గొని టోర్ని వివరాలను వెల్లడించారు. ఈ నాల్గవ సీజన్ పోటీలలో మొత్తం 14 ఫ్రాంచైజ్ జట్లు బరిలోకి దిగుతున్నాయని తెలిపారు. వాల్తేరు క్లబ్, జేసీఐ, బీఎన్ఐ వంటి ప్రముఖ వ్యాపార మరియు సామాజిక సేవా సంస్థల ప్రతినిధులతో పాటు నగరంలోని పలు ప్రముఖ వ్యాపార వర్గాలకు చెందిన పారిశ్రామికవేత్తలు, ప్రతినిధులు ఈ లీగ్‌లో ఉత్సాహంగా భాగస్వాములవుతున్నారన్నారు.ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా కాలేజ్ గ్రౌండ్స్‌లో ఈ నెల చివరి వారం నుంచి సుమారు 20 రోజుల పాటు ఈ మ్యాచ్‌లు అత్యంత ఉత్సాహపూరిత వాతావరణంలో సాగనున్నాయని పేర్కొన్నారు.
కేవలం క్రీడలకు మాత్రమే పరిమితం కాకుండా, విశాఖ వ్యాపార వర్గాల మధ్య పరస్పర స్నేహబంధాన్ని పెంపొందించడం, బిజినెస్ నెట్‌వర్కింగ్‌ను ప్రోత్సహించడం మరియు బలమైన సంబంధాలను నిర్మించడమే ఈ లీగ్ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. 14 బలమైన ఫ్రాంచైజ్ టీమ్‌లు మరియు వ్యాపార ప్రతినిధుల చురుగ్గా పాల్గొనడంతో ఎఫ్సీఎల్ సీజన్-4 విశాఖ నగరంలో మరొక ప్రతిష్టాత్మక క్రీడా వేడుకగా నిలవనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గాదిరాజు ప్యాలెస్ జనరల్ మేనేజర్ జగదీష్‌తో పాటు పలువురు వ్యాపార ప్రముఖులు, క్రీడాభిమానులు పాల్గొన్నారు.