సీపీఎస్ ఉద్యోగులకు ఓపీఎస్‌లోకి మారే అవకాశం కల్పించడం హర్షణీయం
2002హిందీ పండిట్ల పెన్షన్ సాధన సమితి అధ్యక్షుడు: నవగాన రత్నకుమార్
వన్‌టైమ్ ఆప్షన్ మార్గదర్శకాలు విడుదల.. 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల తరఫున ప్రభుత్వానికి కృతజ్ఞతలు.
పాతపట్నం నవంబర్ 11,మేజర్ న్యూస్:
రాష్ట్రంలోని కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్) పరిధిలో ఉన్న అర్హులైన ఉద్యోగ, ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానం (ఓపీఎస్)లోకి మారేందుకు వన్‌టైమ్ ఆప్షన్ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేయడం పట్ల డీఎస్సీ 2002 హిందీ పండిట్ల పెన్షన్ సాధన సమితి అధ్యక్షులు నవగాన రత్నకుమార్ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయం సుమారు 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల జీవితాల్లో భవిష్యత్తుపై భరోసా కల్పించే ముఖ్యమైన ముందడుగుగా అభివర్ణించారు.
ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఎంఎస్ నంబర్ 158 ద్వారా ఉత్తర్వులు జారీ చేయడం ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల్లో సంతోషాన్ని నింపిందన్నారు. సుదీర్ఘకాలంగా సీపీఎస్ విధానంలో కొనసాగుతున్న ఉద్యోగులు పదవీ విరమణ అనంతర ఆర్థిక భద్రతపై ఆందోళన చెందుతున్న నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వారికి ఎంతో ఊరటనిస్తుందని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్‌లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా సీపీఎస్ నుంచి ఓపీఎస్‌కు మారేందుకు మార్గదర్శకాల విడుదలలో కృషి చేసిన ఏపీ జేఏసీ చైర్మన్, ఏపీ ఎన్జీవో సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఆలపాటి విద్యాసాగర్‌కు 11 వేల మంది ఉద్యోగ, ఉపాధ్యాయుల తరఫున ధన్యవాదాలు తెలియజేశారు.
అదేవిధంగా ఓపీఎస్ విధానంలోకి మారేందుకు అర్హత పొందిన ఉద్యోగులకు పదవీ విరమణ అనంతరం పెన్షన్ రూపంలో ఆర్థిక భద్రత లభించే అవకాశం ఉంటుందని నవగాన రత్నకుమార్ తెలిపారు. వృద్ధాప్యంలో కుటుంబ పోషణకు పెన్షన్ ఒక ప్రధాన ఆధారంగా నిలుస్తుందని, నెలవారీ ఆదాయంపై భరోసా కలగడం వల్ల ఉద్యోగుల కుటుంబాలు ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందుతాయని పేర్కొన్నారు. మార్కెట్ ఒడిదుడుకుల ప్రభావంపై ఆధారపడే పెన్షన్ విధానంతో పోలిస్తే నిర్దిష్ట పెన్షన్ విధానంపై ఉద్యోగుల్లో విశ్వాసం పెరుగుతుందన్నారు.
అలాగే పదవీ విరమణ అనంతరం వైద్య ఖర్చులు, కుటుంబ అవసరాలు, పిల్లల బాధ్యతలు వంటి వాటిని నిర్వహించుకోవడానికి పెన్షన్ భరోసా ఎంతో దోహదపడుతుందని వివరించారు. ఉద్యోగ జీవితమంతా ప్రభుత్వ సేవలందించిన ఉద్యోగులకు పదవీ విరమణ తరువాత గౌరవప్రదమైన జీవనం సాగించేందుకు పెన్షన్ భద్రత కీలకమని అన్నారు.
ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలను అర్హులైన ఉద్యోగులందరికీ అందుబాటులోకి తీసుకువచ్చి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వన్‌టైమ్ ఆప్షన్ ప్రక్రియను పూర్తి చేయాలని కోరారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల చిరకాల ఆకాంక్షను గుర్తించి సానుకూల నిర్ణయం తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరోసారి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు నవగాన రత్నకుమార్
ప్రధాన కార్యదర్శి నెమలపురి విష్ణుమూర్తి, ఆర్థిక కార్యదర్శి ధూపాన తవిటి రెడ్డి, సహాధ్యక్షులు జాడు నాగేశ్వరరావు, బల్ల మోహన్ రావు, పీసా చిన్నారావు, మహిళా కార్యదర్శి ఉమా కుమారి మహంతి, పద్మజ కొల్లాయి హర్షం వ్యక్తం చేశారు.