అంగన్వాడీలకు పోషకాహారంపై అవగాహన
అరకులోయ, నవంబర్ 11, మేజర్ న్యూస్:సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం (ఐసిడిఎస్) అరకులోయ ప్రాజెక్టు పరిధిలో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలకు చిన్నారుల పోషకాహారంపై గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య అధికారిణి కె. ప్రియాంక అవగాహన కల్పించారు.స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కు చెందిన 165 అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న కార్యకర్తలకు పిల్లల సమగ్ర అభివృద్ధిపై ప్రత్యేకంగా రెండు రోజులపాటు శిక్షణా తరగతులు నిర్వహించారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు భవనంలో,స్థానిక మండల ప్రజా పరిషత్ అభివృద్ధి కార్యాలయం సమావేశ మందిరంలో అంగన్వాడీ కార్యకర్తలకు పోషణ బీ, పడాయ్ బీ కింద నిర్వహించిన శిక్షణ కార్యక్రమం బుధవారం ముగిసింది.ఈ ముగింపు కార్యక్రమంలో గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి కె.ప్రియాంక మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో చిన్నారులకు పోషకాహారం లోపం లేకుండా చూడాలని సూచించారు.అంగన్వాడీ కార్యకర్తలు పిల్లల శారీరక పోషణ,పూర్వ ప్రాథమిక విద్య బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించాలన్నారు. అంగన్వాడి కేంద్రాలకు వస్తున్న బాల,బాలికలకు ప్రధానంగా ఆరోగ్యం, విద్యపై తీసుకోవలసిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని డాక్టర్ కె.ప్రియాంక పేర్కొన్నారు.అంగన్వాడీ కార్యకర్తలకు శారీరక, మానసిక అభివృద్ధి,పిల్లల చదువు,ఆరోగ్యం, సామాజిక నైపుణ్యం, ఆటపాటల ద్వారా బోధన, మాతృభాషకు ప్రాధాన్యం, రోజువారి విద్యా సమయం, సామాజిక భావోద్యోగాల పెంపు,పిల్లల అభివృద్ధి దశలు,ఇంటింటి సందర్శనల ప్రాధాన్యం, తల్లిదండ్రుల భాగస్వామ్యం వంటి వాటిపై ఐసిడిఎస్ సూపర్వైజర్లు అవగాహన కల్పించారు.అనంతరం శిక్షణ ప్రక్రియను పూర్తిచేసిన అంగన్వాడీ కార్యకర్తలకు ధ్రువీకరణ పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో స్థానిక ఐసిడిఎస్ ప్రాజెక్ట్ అధికారిణి చెల్లు.లక్ష్మీ లావణ్య, సూపర్వైజర్లు కె.లక్ష్మి,వి. రామకృష్ణ,గన్నెల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హెల్త్ విజిటర్ పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు.