విద్యతోనే అభివృద్ధి సాధ్యం.
అనకాపల్లి, నవంబర్ 11, మేజర్ న్యూస్: విద్య ద్వారానే వ్యక్తిత్వవికాసం, రాష్ట్ర, దేశ అభివృద్ధి సాధ్యమని మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బుద్ధ నాగ జగదీశ్వరరావు అన్నారు. జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా బుధవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక శ్రద్ధతో వ్యవస్థలో మార్పులు తీసుకురావడం, వంద రోజుల కార్యక్రమం అమలుతో పదో తరగతి, ఇంటర్‌లో మంచి ఫలితాలు వచ్చాయన్నారు. ఎన్నికల హామీ మేరకు మెగా డీఎస్సీ ద్వారా 16 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంతో పాటు మరో 2770 పోస్టులకు నోటిఫికేషన్, గ్రూప్-2 లో 720 ఉద్యోగాలకు ప్రకటన ఇవ్వడం, ఏటా జాబ్ క్యాలెండర్ అమలు చేయడం లోకేష్ చొరవతోనే సాధ్యమైందని కొనియాడారు. పెట్టుబడులు, పరిశ్రమల రాకతో 6.70 లక్షల ఉద్యోగాలు వచ్చాయని, రానున్న రోజుల్లో మరో 15 లక్షల ఉద్యోగాలకు కృషి జరుగుతోందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యకు రూ.32,308 కోట్లు ఖర్చు చేయడం విద్యకు ఇస్తున్న ప్రాధాన్యతకు నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కాండ్రేగుల సత్యనారాయణ, మల్ల గణేష్, కాండ్రేగుల రవీంద్ర, యలమంచిలి బంగారురాజు తదితరులు పాల్గొన్నారు.