పిల్లల సమగ్ర అభివృద్ధిపై అంగన్వాడీ కార్యకర్తలకు శిక్షణ
పోషకాహార లోపం గుర్తింపు, మెదడు వికాసంపై అవగాహన
నక్కపల్లి, మేజర్ న్యూస్ :నవంబరు 11: చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని గుర్తించి, వారి సంపూర్ణ ఎదుగుదలకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సీహెచ్ సత్యవతి సూచించారు. బుధవారం చినదొడ్డుగల్లు జెడ్పీ ఉన్నత పాఠశాలలో నక్కపల్లి మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలకు 'పోషణ్ భీ పడాయి భీ' కార్యక్రమం ముగింపు శిక్షణ నిర్వహించారు.
ఈ సందర్భంగా పుట్టినప్పటి నుంచి ఆరేళ్లలోపు చిన్నారుల బరువు, ఎత్తు కొలిచి గ్రేడింగ్ చేయడం, వివరాలను పోషణ్ ట్రాకర్ యాప్‌లో నమోదు చేయడంపై అవగాహన కల్పించారు. పోషకాహార లోపం ఉన్న పిల్లలను గుర్తించి ఆసుపత్రులకు రిఫర్ చేయడంతోపాటు, గృహ సందర్శనల ద్వారా తల్లిదండ్రులకు పౌష్టికాహారం, పిల్లల ఎదుగుదల, శారీరక, మానసిక వికాసంపై వివరించాలని సూచించారు.
ముఖ్యంగా సున్నా నుంచి మూడేళ్లలోపు పిల్లలకు ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో ఆటల రూపంలో నేర్పించడం ద్వారా వారిలో ఆసక్తి, ఊహాశక్తి, మేధోశక్తి, భాషా నైపుణ్యాలను పెంపొందించవచ్చని తెలిపారు. తాతమామలతో కలిసి పెరిగే పిల్లల్లోనూ భాషా, మేధో వికాసం మెరుగుపడుతుందని పేర్కొన్నారు. చిన్నారులకు అధికంగా మొబైల్ ఫోన్లు చూపించడం వల్ల వారి అభివృద్ధిపై ప్రతికూల ప్రభావం పడుతుందని హెచ్చరించారు.
తల్లిదండ్రులు పిల్లలను ఒంటరిగా వదలకుండా ప్రేమాభిమానాలతో సమయాన్ని కేటాయించాలని సూచించారు. ముఖ్యంగా సున్నా నుంచి ఎనిమిదేళ్ల వయసులో మెదడు అభివృద్ధి, నైపుణ్యాల పెరుగుదల వేగంగా జరుగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో రెండో ఎంఈఓ దొర పాల్గొన్నారు.