ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత!
*టీపీసీసీ అధికార ప్రతినిధిగా వంగాల వెంకన్న గౌడ్ నియామకం*
*వలిగొండ, మేజర్ న్యూస్:* మండల పరిధిలోని నాగారం గ్రామానికి చెందిన తెలంగాణ ఉద్యమకారుడు వంగాల వెంకన్న గౌడ్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. పార్టీ అధిష్ఠానం ఆయన నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది.ఎన్‌ఎస్‌యూఐలో విద్యార్థి నాయకుడిగా రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన వెంకన్న గౌడ్.. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పలుమార్లు పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నారు. జైలు జీవితాన్ని సైతం అనుభవించారు.తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీకి విధేయుడిగా కొనసాగుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. ఆయన ఉద్యమ నేపథ్యం, పార్టీ పట్ల నిబద్ధత, సేవలను గుర్తించిన అధిష్ఠానం ఈ కీలక బాధ్యతను అప్పగించింది.ఈ సందర్భంగా వెంకన్న గౌడ్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన ఏఐసీసీ, టీపీసీసీ నాయకత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ సిద్ధాంతాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్తూ అధికార ప్రతినిధిగా బాధ్యతాయుతంగా పనిచేస్తానని పేర్కొన్నారు.వెంకన్న గౌడ్ నియామకంపై వలిగొండ మండల కాంగ్రెస్ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, నాగారం గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.