వ్యవసాయ భూమిలో మొసలి సంచారం.. గ్రామస్థుల్లో ఆందోళన!
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం జీర్లపల్లి గ్రామ సర్పంచ్ అమరేశ్వరి శివమణికి చెందిన వ్యవసాయ భూమిలో మొసలి కనిపించడంతో గ్రామస్థుల్లో ఆందోళన నెలకొంది. మొసలిని గమనించిన స్థానికులు అప్రమత్తమయ్యారు. వ్యవసాయ పనుల నిమిత్తం అటువైపు వెళ్లే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
మొసలి సంచారంతో పశువులకు, ప్రజలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా జీర్లపల్లి పరిసర ప్రాంతాలతో పాటు బోరేగావ్, గుంతమర్పల్లి గ్రామాల రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నారు. మొసలి సంచారం ఉన్న ప్రాంతానికి సమీపంలో వ్యవసాయ పనుల కోసం వెళ్లేటప్పుడు జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.
సంబంధిత అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించి మొసలి ఆచూకీ గుర్తించి, ఎలాంటి ప్రమాదం జరగకుండా సురక్షితంగా పట్టుకుని తరలించాలని గ్రామస్థులు కోరుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు చేపట్టి పరిసర గ్రామాల ప్రజలకు భద్రత కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.