భూ రికార్డుల ప్రక్షాళనకు కలెక్టర్ శ్రీకారం.. రైతుల భూములకు పక్కా హామీ!
క్షేత్రస్థాయిలో ఉన్న భూమే రీ-సర్వేకు అసలైన ప్రామాణికం.. రైతుల సమక్షంలోనే పారదర్శక సర్వే
*మద్దులపల్లిలో కాల్వగట్ల మీదుగా బైక్‌పై వెళ్లి భూ రీ-సర్వే పనులను పరిశీలించిన కలెక్టర్ దివాకర టీఎస్
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ :
భూమి రైతుకు అత్యంత విలువైన ఆస్తి.. ఆ భూమిపై హక్కుల విషయంలో ఏళ్ల తరబడి కొనసాగుతున్న వివాదాలకు తెరదించి, ప్రతి రైతుకు తన భూమిపై స్పష్టమైన హక్కులు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన భూ రీ-సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ అధికారులను ఆదేశించారు. రికార్డుల్లో ఉన్న లెక్కలు మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఉన్న భూమి విస్తీర్ణం, హద్దులే రీ-సర్వేకు ప్రామాణికమని స్పష్టం చేశారు. రైతుల సమక్షంలో పూర్తి పారదర్శకతతో సర్వే నిర్వహించి భవిష్యత్తులో భూ వివాదాలకు తావులేకుండా పక్కా రికార్డులు రూపొందించాలని సూచించారు.
కాల్వగట్ల మీదుగా బైక్‌పై కలెక్టర్ పర్యటన..
ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లి రెవెన్యూ గ్రామంలో మంగళవారం కొనసాగుతున్న భూ రీ-సర్వే పనులను కలెక్టర్ దివాకర టీఎస్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పొలాల మధ్య కాల్వగట్ల మీదుగా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ సర్వే జరుగుతున్న ప్రాంతాలకు చేరుకున్నారు. రైతులు, భూ యజమానుల సమక్షంలో రోవర్, ట్యాబ్ తదితర ఆధునిక సాంకేతిక పరికరాలతో నిర్వహిస్తున్న డిజిటల్ సర్వే విధానాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు. ఇప్పటివరకు పూర్తయిన సర్వే, మిగిలిన పనుల పురోగతిపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
రైతుల భూములకు న్యాయం జరగాలి..
ఈ సందర్భంగా రైతులతో నేరుగా మాట్లాడిన కలెక్టర్ వారి భూ సమస్యలు, సందేహాలను తెలుసుకున్నారు. పట్టాదారు పాస్‌బుక్‌లు లేకపోవడం, పాస్‌బుక్‌లలో నమోదైన విస్తీర్ణానికి క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడాలు ఉండటం, పాత రికార్డుల్లో భూమి వివరాలు సరిగా నమోదు కాకపోవడం వంటి సమస్యలను రీ-సర్వే ద్వారా గుర్తించి నిబంధనల ప్రకారం పరిష్కరించే అవకాశం ఉంటుందని వివరించారు. ఏ ఒక్క అర్హుడైన రైతుకు అన్యాయం జరగకుండా, ఎవరి భూమి వివరాలు కూడా సర్వేలో తప్పిపోకుండా అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆదేశించారు.
హద్దుల వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపాలి..
భూముల హద్దుల విషయంలో రైతుల మధ్య వివాదాలు తలెత్తకుండా ప్రతి సర్వే నంబర్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని కలెక్టర్ సూచించారు. పట్టాదారు పాస్‌బుక్‌లో ఉన్న విస్తీర్ణం, క్షేత్రస్థాయిలో వాస్తవంగా ఉన్న విస్తీర్ణం మధ్య వ్యత్యాసం కనిపిస్తే చుట్టుపక్కల రైతుల సమక్షంలో కొలతలు నిర్వహించి వాస్తవ పరిస్థితులను నిర్ధారించాలని తెలిపారు. అవసరమైన చోట పంచనామా నిర్వహించి ఫొటోలతో సహా వివరాలను నమోదు చేయాలని ఆదేశించారు. పాత పహాణీలు, పట్టాదారు పాస్‌బుక్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, సాగుకు సంబంధించిన ఇతర ఆధారాలను పరిశీలించి రికార్డులతో సరిపోల్చాలని స్పష్టం చేశారు.
అధునాతన సాంకేతికతతో పక్కా రికార్డులు..
రోవర్, ట్యాబ్ వంటి ఆధునిక పరికరాలను సమర్థవంతంగా వినియోగిస్తూ ప్రతి భూమిని కచ్చితంగా కొలవాలని కలెక్టర్ తెలిపారు. సర్వే నోటీసులు అందించినట్లు రసీదులు తీసుకోవడం, ఆధార్, మొబైల్ నంబర్ల వివరాలు నమోదు చేయడం, ఫొటోలతో కూడిన పంచనామాలు రూపొందించడం వంటి ప్రక్రియలను తప్పనిసరిగా పూర్తి చేయాలన్నారు. మ్యాప్‌లు, సర్వే నంబర్లు, క్షేత్రస్థాయి కొలతలను సమన్వయం చేస్తూ భవిష్యత్తులో ఎలాంటి భూ వివాదాలకు అవకాశం లేకుండా రికార్డులను రూపొందించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
రైతులారా.. సర్వేకు సహకరించండి!
భూ రీ-సర్వే సమయంలో రైతులు తమ భూముల వద్ద అందుబాటులో ఉండాలని కలెక్టర్ కోరారు. తమ వద్ద ఉన్న పాత పహాణీలు, పట్టాదారు పాస్‌బుక్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర భూ ఆధారాలను అధికారులకు అందజేసి సర్వే ప్రక్రియకు సహకరించాలని సూచించారు. రైతుల భాగస్వామ్యంతోనే పారదర్శకమైన సర్వే సాధ్యమవుతుందని, అర్హులైన భూ యజమానులకు వారి భూములపై స్పష్టత కల్పించి నిబంధనల ప్రకారం పట్టాదారు పాస్‌బుక్‌లు అందేలా రికార్డులను క్రమబద్ధీకరించాలని అధికారులకు ఆదేశించారు.
భూమి హద్దులపై స్పష్టత.. రికార్డుల్లో ఖచ్చితత్వం.. రైతులకు భూ హక్కుల భరోసా లక్ష్యంగా రీ-సర్వేను వేగవంతంగా, నిష్పక్షపాతంగా పూర్తి చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఖమ్మం రూరల్ మండల తహసీల్దార్ వినయేందర్ రెడ్డి, సంబంధిత అధికారులు, సర్వే సిబ్బంది, రైతులు, భూ యజమానులు పాల్గొన్నారు.