మర్రిపాడులో నిలువ నీడ కరువాయే..! ఎండలోనూ, వానలోనూ నిల్చుండాల్సిందే మహిళలకు మరుగుదొడ్లు కరువు
మర్రిపాడు, మేజర్ న్యూస్: జిల్లా సరిహద్దు ప్రాంతంలో నెల్లూరు- ముంబై జాతీయ రహదారిపై ప్రధానమైన సెంటర్ మర్రిపాడు సెంటర్. అటు కడపకు ఇటు నెల్లూరుకు మర్రిపాడు కీలకమైనది. అలాంటి తరుణంలో ప్రయాణికులకు బస్సు షెల్టర్ కరువు అవడంతో ఎండలోనూ, వానలోనూ నిల్చుని పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతోపాటుగా మహిళలకు మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడక తప్పడం లేదు. అంతేకాకుండా త్రాగునీటికి అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అటు అధికారులు ఇటు ప్రభుత్వాలు మారుతున్న కనీసం మర్రిపాడు సెంటర్లో బస్సులు నిర్మించకపోవడం దారుణమని మండల ప్రజలు పెదవి విరుస్తున్నారు. వివరాల్లోకి వెళితే..
జిల్లాలో చిట్టచివరి మండలం మర్రిపాడు మండలం. ఈ మండలం పొడవునా నెల్లూరు- ముంబై జాతీయ రహదారి ఉంది. ఈ రహదారిలో నిత్యం వేలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. అంతేకాకుండా మండలంలోని ప్రజలు అటు కడపకు గాని ఇటు నెల్లూరుకు గాని ప్రయాణం సాగిస్తుంటారు. అలాంటి తరుణంలో మర్రిపాడు బస్సులను ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో మర్రిపాడు సెంటర్లో బస్స్టాప్ లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎండలోను వానలోనూ నిలుచుకుని పడిగాపులు గాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇకపోతే మహిళలకు మరుగుదొడ్లు కూడా లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో పాటుగా త్రాగునీరు కూడా కొనుగోలు చేసి తాగాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క మర్రిపాడు మండలం ప్రజలే కాకుండా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులతో పాటుగా కార్లలో ప్రయాణించే వాళ్ళు, ఆటోలో, ద్విచక్ర వాహనాల్లో ప్రయాణించే ప్రయాణికులు కూడా కాసేపు సెంటర్లో సేదదీరేందుకు మరియు టిఫిన్ భోజనాలు చేసేందుకు ఆగుతుంటారు. ఈ నేపథ్యంలో నిలుచు కొనేందుకు నీడ కూడా కరువు అవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వర్షం వస్తే దుకాణాల్లోకి వెళ్లి తలదాచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతేకాకుండా విపరీతమైన ఎండకు రహదారిలోనే నిలుచొని ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఈ సమస్య సంవత్సరాల తరబడి నుండి ఉన్నప్పటికీ అటు పాలకులు గానీ ఇటు ప్రభుత్వాలు కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా మర్రిపాడు సెంటర్లో వర్షాలతో పాటు మహిళలకు మరుగుదొడ్ల నిర్మాణాలను ఏర్పాటు చేయాల్సిందిగా పలువురు కోరుతున్నారు.