19న ఎంపీపీ ఎన్నిక
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంఎంపీపీ వైస్ ఎంపీపీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ కీలక ఆదేశాలు జారీ చేసింది. పరోక్ష ఎన్నికల ప్రత్యేక సమావేశాల నిర్వహణకు నవంబర్ 14వ తేదీలోగా సభ్యులందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించింది. నవంబర్ 19న జరిగే ఎన్నికల రోజు ఉదయం 10 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు అవకాశం కల్పించనున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంటుంది. మధ్యాహ్నం 1 గంటకు కో-ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనుండగా, మధ్యాహ్నం 3 గంటలకు ఎంపీపీ అధ్యక్ష, ఉపాధ్యక్షులతో పాటు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్ ఎన్నికలు నిర్వహించనున్నారు.
ఈ ఎన్నికల్లో ఓటింగ్ ప్రక్రియను చేతులెత్తే పద్ధతి ద్వారా నిర్వహించనున్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల సభ్యులు ఆయా పార్టీల విప్‌కు లోబడి ఓటు వేయాల్సి ఉంటుంది. పార్టీ విప్‌ను ధిక్కరించి ఓటు వేసిన సభ్యులపై సభ్యత్వ రద్దు వేటు పడే అవకాశం ఉంది. అయితే కో-ఆప్షన్ సభ్యుల ఎన్నికకు పార్టీ విప్ నిబంధన వర్తించదు అన్నారు. ముందుగా అధ్యక్ష లేదా చైర్‌పర్సన్ ఎన్నిక పూర్తయిన తర్వాతే ఉపాధ్యక్ష లేదా వైస్ చైర్‌పర్సన్ ఎన్నిక నిర్వహిస్తారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించి అన్ని నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయాలని ఎన్నికల కమిషన్ సూచించింది అని పెరవలి మండల ప్రత్యేక అధికారి, రిటర్నింగ్ అధికారి ఎం. సునీల్ వినయ్ తెలియజేశారు.