ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలి
నేటి దినపత్రిక సూర్య బ్యూరో రాజమహేంద్రవరంరాష్ట్రంలో పెరుగుతున్న బియ్యం ధరలను నియంత్రించి, వినియోగదారులకు నాణ్యమైన బియ్యాన్ని సరసమైన ధరలకు అందించేందుకు ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే బియ్యం విక్రయించాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారులు రైస్ మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులకు స్పష్టం చేశారు.కమిషనర్, పౌర సరఫరాల శాఖ ఆదేశాల మేరకు, తూర్పు గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ వై. మేఘ స్వరూప్ దిశానిర్దేశంలో మంగళవారం రాజమహేంద్రవరం లోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో రైస్ మిల్లర్లు, వ్యాపారుల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి వి. పార్వతి, జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ బి. గణేష్ కుమార్ పాల్గొని బియ్యం ధరల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. బియ్యం రకాల వారీగా నిర్ణయించిన ధరలు
వినియోగదారుల నుంచి బియ్యానికి అధిక ధరలు వసూలు చేయకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే విక్రయించాలని అధికారులు స్పష్టం చేశారు. బియ్యం రకం, కిలో ధర వివరాలు ఇలా ఉన్నాయి.బీపీటీ 3291 – కిలో రూ.56,- బీపీటీ 5204 – కిలో రూ.56
- కేఎన్‌ఎం – కిలో రూ.66
- హెచ్‌ఎంటీ – కిలో రూ.76
- ఆర్ఎన్ఆర్ – కిలో రూ.76
- జైశ్రీరామ్ – కిలో రూ.82
- ఎంటీయూ సాధారణ రకాలు – కిలో రూ.47
ప్యాకింగ్ చేసిన బియ్యం సంచులపై ప్రభుత్వం నిర్ణయించిన ధరలను గరిష్ఠ చిల్లర విక్రయ ధర (ఎంఆర్‌పీ)గా తప్పనిసరిగా ముద్రించాలని సూచించారు. బ్రాండ్ పేరు, బ్రాండ్ విలువను సాకుగా చూపి నిర్ణీత ధరలకు మించి విక్రయించరాదని స్పష్టం చేశారు. ఒకే రకమైన బియ్యానికి అనవసరంగా అధిక ధరలు నిర్ణయించడం, వినియోగదారుల నుంచి అదనపు మొత్తాలు వసూలు చేయడం వంటి చర్యలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.
అన్ని రైస్ మిల్లులు, హోల్‌సేల్, రిటైల్ విక్రయ కేంద్రాల్లో బియ్యం రకాలు, ప్రభుత్వం నిర్ణయించిన ధరల పట్టికను ప్రజలకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాలని ఆదేశించారు. రైస్ మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు తమ వద్ద ఉన్న బియ్యం, ధాన్యం నిల్వల వివరాలను కేంద్ర ప్రభుత్వ ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో ప్రతి శుక్రవారం తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు.
నిబంధనల అమలును పర్యవేక్షించేందుకు పౌర సరఫరాల శాఖ, తూనికలు-కొలతల శాఖ, విజిలెన్స్ శాఖల అధికారులు రైస్ మిల్లులు, హోల్‌సేల్, రిటైల్ విక్రయ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తారని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సామాన్య ప్రజలకు నాణ్యమైన బియ్యాన్ని తక్కువ ధరకు అందించేందుకు జిల్లాలో ప్రత్యేక విక్రయ కౌంటర్లను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. బీపీటీ రకం బియ్యాన్ని కిలో రూ.49కు, కేఎన్‌ఎం రకం బియ్యాన్ని కిలో రూ.50కు విక్రయిస్తున్నట్లు వెల్లడించారు. రేషన్ కార్డు లేదా ఆధార్ నంబరు ఆధారంగా నెలకు 26 కిలోల వరకు బియ్యం కొనుగోలు చేసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 15 ప్రత్యేక కౌంటర్ల ద్వారా బియ్యం విక్రయాలు జరుగుతున్నాయని, రైతుబజార్లతో పాటు ఉండ్రాజవరం, పెరవలి, నిడదవోలు, కొవ్వూరు, సీతానగరం, గోపాలపురం, దేవరపల్లి మండలాల్లో ప్రత్యేక విక్రయ ఏర్పాట్లు చేసినట్లు ఆమె వివరించారు. ప్రతి మండల కేంద్రంలోనూ ఒక ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 3,276 క్వింటాళ్ల బియ్యం విక్రయించగా, సుమారు 12,400 మంది వినియోగదారులు ప్రయోజనం పొందినట్లు వెల్లడించారు.జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ బి. గణేష్ కుమార్ మాట్లాడుతూ, ధరణి బ్రాండ్ బియ్యం ప్యాకింగ్ కోసం జిల్లాలో ఇప్పటికే రెండు మిల్లులను ఎంపిక చేశామని, అదనంగా మరో రెండు మిల్లులను ఎంపిక చేసే ప్రక్రియ చేపట్టనున్నట్లు తెలిపారు. ప్రజలకు నిరంతరాయంగా బియ్యం అందుబాటులో ఉండేలా ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయాలు కొనసాగిస్తామని చెప్పారు. ప్రతి కౌంటర్ వద్ద డిజిటల్ చెల్లింపుల సదుపాయం కల్పించడంతో పాటు, క్యూఆర్ కోడ్ ద్వారా వినియోగదారుల అభిప్రాయాలను సేకరించనున్నట్లు వివరించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల రాజమహేంద్రవరం, కొవ్వూరు సహాయ సరఫరాల అధికారులు, పౌర సరఫరాల ఉప తహసీల్దార్లు, రైస్ మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారుల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.