నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు పటిష్ట చర్యలు
నెల్లూరు కలెక్టరేట్, మేజర్ న్యూస్ : జిల్లాలో నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు, నిల్వల పర్యవేక్షణకు పటిష్ట చర్యలు చేపడుతున్నట్లు జాయింట్ కలెక్టర్ మొగిలి వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం నెల్లూరు కలెక్టరేట్‌లోని ఎస్.ఆర్. శంకరన్ సమావేశ మందిరంలో పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ, రైస్ మిల్లర్లు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు తమ వద్ద ఉన్న సరుకుల నిల్వల వివరాలను ఈ నెల 13వ తేదీలోగా ఫుడ్ స్టాక్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదు చేయాలని ఆదేశించారు. ప్రతి శుక్రవారం నిల్వల వివరాలను అప్‌డేట్ చేయాలని సూచించారు. నిల్వలను దాచిపెట్టి కృత్రిమ కొరత సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బహిరంగ మార్కెట్లో నాణ్యమైన బియ్యం ధర కిలో రూ.80 వరకు ఉండటంతో సామాన్య ప్రజలపై ఆర్థిక భారం తగ్గించేందుకు ప్రభుత్వం రాయితీ ధరలకు బియ్యం విక్రయిస్తోందన్నారు. జిల్లాలో ప్రజలు అధికంగా వినియోగించే బిపిటి, కేఎన్ఎం రకాల బియ్యాన్ని కిలో రూ.66 చొప్పున విక్రయిస్తున్నట్లు తెలిపారు. కావలి, గూడూరు, పొదలకూరు, నెల్లూరు నగరంలోని రెండు రైతు బజార్లలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. మరో రెండు మూడు రోజుల్లో జిల్లా సహకార శాఖ సమన్వయంతో మండల కేంద్రాల్లోని ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (PACS) ద్వారా కూడా బియ్యం విక్రయాలు ప్రారంభిస్తామన్నారు. అదేవిధంగా మార్కెట్లో ఉల్లి ధర కిలో రూ.50 దాటడంతో వినియోగదారులకు ఊరట కల్పించేందుకు మార్కెటింగ్ శాఖ ఆధ్వర్యంలో కిలో రూ.35కే విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఒక్కొక్కరికి రెండు కిలోల చొప్పున అందిస్తున్నామని, ఇప్పటికే ఫతేఖాన్‌పేట మార్కెట్లో ప్రత్యేక విక్రయ కేంద్రం ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ప్రజలు ప్రభుత్వ రాయితీ విక్రయ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పౌరసరఫరాల అధికారి పుల్లయ్య, లక్ష్మీనారాయణ, సివిల్ సప్లై డిప్యూటీ తహశీల్దార్లు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రతినిధులు, హోల్‌సేల్, రిటైల్ వ్యాపారులు పాల్గొన్నారు.