అనంతగిరి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా. ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి .
అయ్యప్ప స్వామి పడి పూజలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి.
కోదాడ (మేజర్ న్యూస్)అనంతగిరిలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయంలో సోమవారం రాత్రి భక్తిశ్రద్ధలతో నిర్వహించిన అయ్యప్ప స్వామి పడి పూజా మహోత్సవంలో కోదాడ శాసనసభ్యురాలు నలమాద పద్మావతి రెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయ్యప్ప స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు.
అనంతరం ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి మాట్లాడుతూ అనంతగిరి అయ్యప్ప స్వామి దేవాలయాన్ని ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.దేవాలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ఆలయ పరిసరాల్లో వెలుతురు సౌకర్యాన్ని పెంపొందించేందుకు హైమాస్ట్ లైట్లు మంజూరు చేస్తానని ప్రకటించారు.
ఆలయ అభివృద్ధికి తనవంతు సహాయ సహకారాలు అందిస్తానని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి, డేగ కొండయ్య, కొండపల్లి వాసు తదితరులు పాల్గొన్నారు.