భూమి.. భుక్తి.. విముక్తి కోసం అమరుల పోరాటం చిరస్మరణీయం
బయ్యారం, మేజర్ న్యూస్, బయ్యారం మండలం బాలాజీపేటలో అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా అమరవీరుల సంస్మరణ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ప్రదర్శన చేపట్టి,అమరుడు కామ్రేడ్ ఎర్రమళ్ల ఎర్రన్న స్మారక స్థూపం వద్ద గ్రామ కమిటీ కార్యదర్శి కామ్రేడ్ కొత్త రామదాసు జెండా ఆవిష్కరించారు.అనంతరం సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మండల నాయకులు తోకల వెంకన్న అధ్యక్షతన సభ నిర్వహించారు.ఈ సందర్భంగా అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించి,వారి ఆశయ సాధన కోసం నిరంతరం పోరాడుతామని ప్రతిజ్ఞ చేశారు.సభలో సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ మహబూబాబాద్ జిల్లా కార్యదర్శి మండల వెంకన్న, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌని ఐలయ్య మాట్లాడుతూ..80 ఏళ్ల స్వాతంత్ర్య పాలనలోనూ పేదల బతుకులు మారలేదని,దేశ సంపద కొద్దిమంది గుత్తాధిపతుల చేతుల్లోనే కేంద్రీకృతమైందని విమర్శించారు.నిజమైన స్వాతంత్ర్యం,దోపిడీ,పీడన,అణచివేతలేని సమాజ నిర్మాణం కోసం విప్లవ పోరాటాలు కొనసాగాలని పిలుపునిచ్చారు.
నక్సల్బరి,శ్రీకాకుళం, గోదావరి లోయ విప్లవోద్యమాలకు నాయకత్వం వహించిన చారుమజుందార్, చండ్ర పుల్లారెడ్డి, దేవులపల్లి వెంకటేశ్వరరావు,తరిమెల నాగిరెడ్డి,సత్యనారాయణ సింగ్ వంటి నాయకుల త్యాగాలు చిరస్మరణీయమన్నారు.చండ్ర పుల్లారెడ్డి నేతృత్వంలోని గోదావరి లోయ పోరాటం భూపంపిణీ,కూలిరేట్ల పెంపు, ఆదివాసీ,దళిత,పీడిత వర్గాల ఆత్మవిశ్వాసం పెంపొందించడంలో కీలక పాత్ర పోషించిందని పేర్కొన్నారు.ఆ పోరాట వారసత్వాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మోకాళ్ల మురళీకృష్ణ,నందగిరి వెంకటేశ్వర్లు,చింత వెంకన్న,ఎం. యాకన్న,గుడిబోయిన రమేష్, నేతగాని రాకేష్,మాదారపు నాగరాజు,ఎస్.కె. మహమూద్, అరుణోదయ కళాకారులు తదితరులు పాల్గొన్నారు.
రిపోర్టర్: స్వామి, బయ్యారం, మహబూబాద్ జిల్లా