నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి
నల్లగొండ రైతు మహాసభలను జయప్రదం చేయండి
నవంబర్ 15న రైతు బహిరంగ సభకు వేలాదిగా తరలిరండి.. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పిలుపు
చేర్యాల మేజర్ న్యూస్ ...............
చేర్యాల : అఖిలభారత రైతు సంఘం (ఏఐకేఎస్) ఆధ్వర్యంలో నవంబర్ 15 నుంచి 18 వరకు నల్లగొండలో నిర్వహించనున్న 36వ అఖిలభారత రైతు మహాసభలను జయప్రదం చేయాలని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్కా రాములు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కొమురవెల్లి మండల కేంద్రంలో నిర్వహించిన ప్రచార ట్రాక్టర్ ర్యాలీని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా చుక్కా రాములు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడుతోందని విమర్శించారు. కార్పొరేట్ వ్యవసాయానికి అనుకూలంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. స్వేచ్ఛా వాణిజ్య బిల్లు, విద్యుత్ సవరణ బిల్లు, విత్తన సవరణ బిల్లులను ఉపసంహరించుకోవాలని, యూరియా ఫర్టిలైజర్ యాప్‌ను తొలగించి పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం సాగునీరు అందించకుండా వరి సాగుపై ఆంక్షలు విధించడం సరికాదని, రైతుల పంటలకు రక్షణ కల్పించి అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం కోసం పార్టీలకతీతంగా రైతులంతా ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.కొమురవెల్లి నుంచి ప్రారంభమైన ట్రాక్టర్ ర్యాలీ చేర్యాల వీరభద్ర టాకీస్ సెంటర్ వరకు కొనసాగింది. ముగింపు కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు ఆముదాల మల్లారెడ్డి మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల రైతు వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు రైతాంగం ఉద్యమాలకు సిద్ధం కావాలని, నవంబర్ 15న నల్లగొండలో జరిగే బహిరంగ సభకు వేలాదిగా తరలిరావాలని కోరారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం సిద్ధిపేట జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట్ మావో, ప్రజాసంఘాల నాయకులు, రైతు సంఘాల ప్రతినిధులు, సర్పంచ్ గొర్రె శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.