బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారులను 30 అడుగుల వెడల్పుతో నిర్మించాలి!
పటాస్ చెరు ; నియోజకవర్గంలోని జేపీ కాలనీ డివిజన్ పరిధిలో బండ్లగూడకు వెళ్లే రెండు ప్రధాన రహదారుల దుస్థితిని వెంటనే పరిష్కరించాలని మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ అధికారులను కోరారు. సుమారు 20 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ రహదారులు ప్రస్తుతం పూర్తిగా దెబ్బతినడంతో పాటు కేవలం 12 అడుగుల వెడల్పు మాత్రమే ఉండటంతో పారిశ్రామిక వాహనాల రాకపోకలకు, స్థానిక ప్రజల ప్రయాణాలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.ఈ సమస్య పరిష్కారం కోసం శుక్రవారం పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గారి అధికారిక లేఖపై పరిశ్రమల మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఐఐసీ) మేనేజింగ్ డైరెక్టర్, సంబంధిత ప్రాంతీయ అధికారులను కలిసి మెట్టు కుమార్ యాదవ్ వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బండ్లగూడకు వెళ్లేందుకు ప్రధానంగా రెండు రహదారులు ఉన్నాయని, మొదటిది టాటా మోటార్స్ వద్ద నుంచి బండ్లగూడకు వెళ్లే మార్గం కాగా, రెండోది అంతర్జాతీయ పంటల పరిశోధనా సంస్థ (ఇక్రిశాట్) నుంచి బండ్లగూడకు వెళ్లే మార్గమని వివరించారు. ఈ రెండు రహదారులు దాదాపు రెండు దశాబ్దాల క్రితం నిర్మించినవని, ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు.ఈ మార్గాల్లో భారీ పారిశ్రామిక వాహనాలు, ఇతర రవాణా వాహనాలు నిరంతరం రాకపోకలు సాగిస్తుండటంతో రహదారుల వెడల్పు సరిపోక ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లే వాహనాలతో పాటు బండ్లగూడ స్థానిక ప్రజలు కూడా నిత్యం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బండ్లగూడ పరిసర ప్రాంతం పూర్తిస్థాయి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో ఈ రెండు రహదారులకు ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. పారిశ్రామిక అవసరాలు, ప్రజల రవాణా సౌకర్యాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుతం ఉన్న 12 అడుగుల రహదారులను 30 అడుగుల వెడల్పుకు విస్తరించి, నాణ్యతా ప్రమాణాలతో నూతన రహదారులు నిర్మించాలని విజ్ఞప్తి చేశారు.
అధికారులు తక్షణమే స్పందించాలి..
రెండు ప్రధాన రహదారుల దుస్థితిపై సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వాస్తవ పరిస్థితులను పరిశీలించాలని మెట్టు కుమార్ యాదవ్ కోరారు. ప్రజలు, పారిశ్రామిక సంస్థలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిగణనలోకి తీసుకొని నూతన రహదారుల నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదనలు సిద్ధం చేసి, యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే పారిశ్రామిక వాహనాల రాకపోకలు సులభతరం కావడంతో పాటు బండ్లగూడ ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.