భవిష్యత్తుపై స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలి – జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్
సూర్య, ఉట్నూర్ :విద్యార్థులు అన్ని రకాల సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ సూచించారు. సోమవారం ఉట్నూర్ మండల కేంద్రంలోని కేబి కాంప్లెక్స్‌లో గల ఐటీఐ కళాశాలలో 300 మంది విద్యార్థులతో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా ఎస్పీ విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, సోషల్ మీడియా వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో కలిసి సైబర్ నేరాలపై అవగాహన కల్పించే పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ప్రస్తుత కాలంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వాటి పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ముఖ్యంగా సోషల్ మీడియాను జాగ్రత్తగా వినియోగించాలని, గుర్తుతెలియని వ్యక్తుల ఫ్రెండ్ రిక్వెస్టులు, మెసేజ్‌లు, లింకులు, ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. అత్యాశకు గురై తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించవచ్చని, అధిక లాభాలు వస్తాయని చెప్పే ఆఫర్లను నమ్మి సైబర్ మోసాలకు గురికావద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు వివిధ ప్రాంతాల నుంచి, కొన్ని సందర్భాల్లో విదేశాల నుంచి కూడా నేరాలకు పాల్పడుతున్నారని, వారి పట్ల అప్రమత్తతతో పాటు అవగాహన కలిగి ఉండటం ద్వారా సైబర్ మోసాలను అడ్డుకోవచ్చని పేర్కొన్నారు. ప్రస్తుతం జరుగుతున్న కేవైసీ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ మోసాలు, ఫేక్ బాబా పేరుతో ఆధ్యాత్మిక మోసాలు, సోషల్ మీడియా ఫ్రాడ్, ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, మ్యాట్రిమోనీ ఫ్రాడ్, నకిలీ లింకులు, మెసేజ్‌ల ద్వారా జరిగే మోసాలు, ఓటీపీ ఫ్రాడ్, జాబ్ ఫ్రాడ్, మ్యూల్ అకౌంట్స్ వంటి సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ మోసానికి గురైన వెంటనే ఆలస్యం చేయకుండా 1930 సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసి సమాచారం అందించాలని, పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు.
విద్యార్థులు రోడ్డు భద్రతా నియమాలను తప్పనిసరిగా పాటించాలని, వాహనాలు నడిపే సమయంలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, హెల్మెట్ ధరించి ప్రమాదాల నివారణకు బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు. విద్యార్థులు తమ భవిష్యత్తుపై స్పష్టమైన నిర్దేశాలతో ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకొని, వాటి సాధనకు క్రమశిక్షణతో కృషి చేస్తూ దేశ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో ఉట్నూర్ ఎఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపిఎస్, సీఐ ఎం. ప్రసాద్, కళాశాల ప్రిన్సిపాల్ ఆర్. శ్రీనివాస్, డి 4సి ఏఎస్ఐ సురేందర్, పోలీసు సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.