ఆరోపణలు సరే చర్యలెక్కడ సీఎం గారూ ?
మూడేళ్ల పాలనలోనూ అవినీతి ఆరోపణలకు తేలని తుది లెక్క.. విచారణలు ఎక్కడ? చట్టపరమైన చర్యలేవి?గత పాలకులపై విమర్శలకే పరిమితమా..? ప్రజలకు కావాల్సింది రాజకీయ ప్రసంగాలు కాదు.. ఆధారాలతో కూడిన నిజాలు, బాధ్యులపై చర్యలు!రాజకీయాల్లో ఆరోపణలు సహజం. అధికారంలో ఉన్నవారు ప్రతిపక్షాలపై, ప్రతిపక్షంలో ఉన్నవారు అధికార పక్షంపై విమర్శలు చేయడం ప్రజాస్వామ్యంలో కొత్తేమీ కాదు. కానీ అవినీతి ఆరోపణలు మాత్రం రాజకీయ ప్రసంగాలకే పరిమితమవుతుంటే ప్రజల్లో అనేక అనుమానాలు తలెత్తడం సహజం. ముఖ్యంగా ప్రజాధనానికి సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై నిజానిజాలు వెలుగులోకి తీసుకురావాల్సిన బాధ్యత అధికారంలో ఉన్న ప్రభుత్వానిదే.ఇటీవల సిద్దిపేట గడ్డపై నిర్వహించిన భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేసీఆర్ కుటుంబం, గత పాలనలో జరిగిన ప్రాజెక్టుల నిర్మాణాలు, కాంట్రాక్టులు, కమిషన్లు, ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలపై పలు ఆరోపణలు చేశారు. గత పదేళ్ల పాలనలో ప్రజాధనం దుర్వినియోగమైందని, కుటుంబ పాలన సాగిందని విమర్శించారు. ప్రజలకు గత పాలకులు లెక్కలు చెప్పాల్సిన అవసరం ఉందని ప్రశ్నించారు.అయితే ముఖ్యమంత్రి ప్రసంగం విన్న ప్రజల్లో ఇప్పుడు మరో కీలక ప్రశ్న వినిపిస్తోంది. గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని ఆరోపిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు గడుస్తున్నా ఆ ఆరోపణలపై పూర్తిస్థాయి నిజానిజాలను ప్రజల ముందుంచడంలో ఎందుకు జాప్యం జరుగుతోంది?రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనపై వచ్చిన అవినీతి ఆరోపణలు, కుటుంబ పాలన, ప్రజా సమస్యలు కూడా ప్రధాన రాజకీయ అంశాలుగా నిలిచాయి. పీసీసీ అధ్యక్షుడిగా పార్టీని ముందుండి నడిపించిన రేవంత్ రెడ్డి, ప్రజల్లో మార్పు ఆకాంక్షను బలంగా వినిపించారు. గత పాలకుల అవినీతిని బయటపెడతామని, ప్రజాధనాన్ని దోచుకున్న వారిని వదిలిపెట్టబోమని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నేతలు ప్రజలకు భరోసా ఇచ్చారు.ఆ హామీలను విశ్వసించిన ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారాన్ని అప్పగించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డికి పాలనా బాధ్యతలు అప్పగించారు.అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంపై వచ్చిన ఆరోపణల విషయంలో ప్రభుత్వం సాధించిన పురోగతి ఏమిటన్నది ఇప్పుడు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏయే ప్రాజెక్టుల్లో అవకతవకలు జరిగాయి? ఎవరి పాత్ర ఎంత? ఎంత ప్రజాధనం నష్టపోయింది? ఏ విచారణలు పూర్తయ్యాయి? ఎవరిపై అభియోగాలు నమోదయ్యాయి? ఎంతమందిపై చట్టపరమైన చర్యలు తీసుకున్నారు? అనే ప్రశ్నలకు ప్రభుత్వం స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలి.ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తికి పాలనా నిర్ణయాలు తీసుకునే అధికారం, వ్యవస్థలను సమన్వయం చేసే బాధ్యత ఉంటుంది. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందని బలమైన ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తే, వాటిని సంబంధిత దర్యాప్తు సంస్థలకు అందించి విచారణను వేగవంతం చేయాలి. తప్పు చేసినట్లు న్యాయపరంగా నిర్ధారణ అయితే బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలి.మరి ఇందులో ఎదురవుతున్న అడ్డంకులేమిటి? విచారణలకు సంబంధించిన ప్రక్రియలో ఏమైనా న్యాయపరమైన చిక్కులున్నాయా? ఆధారాల సేకరణలో జాప్యమా? అధికార యంత్రాంగం నుంచి సహకారం కొరవడిందా? లేక రాజకీయ నిర్ణయాల విషయంలోనే ఏదైనా సందిగ్ధత ఉందా?ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజలకు కావాల్సింది ఎవరినో రాజకీయంగా దోషిగా ప్రకటించడం కాదు. నిష్పక్షపాత విచారణ జరిపి, ఆధారాలతో నిజాలను నిరూపించి, చట్టం ముందు అందరినీ సమానంగా నిలబెట్టడం.ముఖ్యమంత్రి సభల్లో, అసెంబ్లీలో గత ప్రభుత్వంపై పదేపదే అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు కూడా తమపై వస్తున్న ఆరోపణలను రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో సామాన్య ప్రజలకు అసలు నిజం ఏమిటో తెలుసుకోవడం కష్టంగా మారుతోంది.ప్రభుత్వం చెబుతున్న ఆరోపణలు నిజమైతే వాటిని ఆధారాలతో నిరూపించాలి. ఆరోపణల్లో వాస్తవం లేకపోతే ఆ విషయాన్ని కూడా విచారణ ద్వారా స్పష్టం చేయాలి. విచారణలు సాగకుండా, రాజకీయ వేదికలపై ఆరోపణలు మాత్రం కొనసాగితే ప్రజల్లో అనుమానాలు మరింత పెరిగే అవకాశం ఉంది.అవినీతి జరిగిందని ఆరోపించడం ఒక బాధ్యత అయితే, దానిని నిరూపించేందుకు పారదర్శకమైన విచారణ జరిపించడం అంతకంటే పెద్ద బాధ్యత. ప్రజాస్వామ్యంలో రాజకీయ విమర్శలకు మించి చట్టపరమైన జవాబుదారీతనమే ముఖ్యం గతంలో అధికారంలో ఉన్నవారు ఎవరైనా, ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు ఎవరైనా ప్రజాధనం దుర్వినియోగం చేసినట్లు తేలితే చట్టం ప్రకారం చర్యలు తప్పనిసరి. ఇందులో పార్టీలు, కుటుంబాలు, పదవులు, రాజకీయ పలుకుబడికి స్థానం ఉండకూడదు.గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రాజెక్టులు, కాంట్రాక్టులు, ఆర్థిక లావాదేవీలపై విచారణల స్థితిగతులను ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంచాలి. విచారణ పూర్తయిన అంశాలపై నివేదికలు వెల్లడించాలి. పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని వివరించాలి. తప్పు చేసినవారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. అదే సమయంలో ఆధారాలు లేకుండా ఎవరినీ దోషిగా చిత్రీకరించకూడదు.సిద్దిపేట గడ్డపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన రాజకీయ ప్రసంగం రాష్ట్రవ్యాప్తంగా చర్చకు దారితీసింది. అయితే సిద్దిపేట ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఇప్పుడు ఒక స్పష్టమైన సమాధానాన్ని ఆశిస్తున్నారు.గత ప్రభుత్వంపై చేసిన అవినీతి ఆరోపణల్లో ఎన్ని నిరూపితమయ్యాయి? ఎన్ని కేసులు విచారణ దశలో ఉన్నాయి? ఎన్ని కేసుల్లో చార్జిషీట్లు దాఖలయ్యాయి? ఎంత ప్రజాధనం నష్టం జరిగిందని అధికారికంగా గుర్తించారు? బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? ఇంకా ఎన్ని అంశాలపై విచారణ జరగాల్సి ఉంది?ఈ వివరాలను ప్రభుత్వం శ్వేతపత్రం రూపంలో ప్రజల ముందుంచితే అనేక అనుమానాలకు తెరపడుతుంది.ప్రజల తీర్పు అధికారాన్ని ఇస్తుంది అధికారం జవాబుదారీతనాన్ని కూడా కోరుతుంది ప్రజలు గత ప్రభుత్వాన్ని గద్దె దించి కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇచ్చింది కేవలం రాజకీయ నాయకుల ప్రసంగాలు వినడానికి కాదు. పాలనలో మార్పు రావాలని, అవినీతికి అడ్డుకట్ట పడాలని, ప్రజాధనానికి రక్షణ ఉండాలని, తప్పు చేసినవారికి శిక్ష పడాలని ఆశించారు.కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రజల తరఫున ఒక సూటి ప్రశ్న..గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందని మీరు చెబుతున్న మాటలకు ఆధారాలేమిటి? ఆ ఆధారాలపై ఇప్పటివరకు తీసుకున్న చట్టపరమైన చర్యలేమిటి? ఇంకా జాప్యం ఎందుకు జరుగుతోంది?రాజకీయ సభల్లో ఆరోపణలు చేయడం కంటే, ఆ ఆరోపణలను న్యాయస్థానాల్లో నిరూపించి బాధ్యులకు శిక్ష పడేలా చేయడమే ప్రజలు కోరుకుంటున్నారు.ఎందుకంటే ప్రజలకు కావాల్సింది మరో రాజకీయ ఆరోపణ కాదు.. అవినీతిపై అంతిమ నిజం!ప్రజాస్వామ్యంలో ప్రశ్నించడం ప్రజల హక్కు.. సమాధానం చెప్పడం ప్రభుత్వ బాధ్యత!
వ్యాసకర్త :దేవులపల్లి భూపతి ఎంఫిల్, ఎం ఏ, డీఎడ్, గేయ రచయిత, జర్నలిస్ట్ 9642228313