రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలి : కలెక్టర్ .పి.రాజాబాబు
ఒంగోలు, మేజర్‌న్యూస్ :
జిల్లాలోని రైతులకు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాల ద్వారా కలుగుతున్న ప్రయోజనంతో పాటు వారి అవసరాలను కూడా అధ్యయనం చేయాలని కలెక్టర్ శ్రీ.పి.రాజాబాబు చెప్పారు. రైతులకు దిగుబడి, ఆదాయం పెంపు కోసం సమగ్ర వివరాలతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకముగా రూపొందించిన ' ప్రగతి ' వెబ్ సైట్ లో పొందుపరచాల్సిన అంశాలపై సోమవారం ప్రకాశం భవనంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లాస్థాయి వ్యవసాయ టాస్క్ ఫోర్స్ కమిటీ సమావేశం జరిగింది. జిల్లాలో సాగు తీరుపై జాయింట్ కలెక్టర్ శ్రీమతి కల్పనా కుమారితో కలిసి కలెక్టర్ సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వం రూపొందించిన వెబ్సైట్ ఉద్దేశాలను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు ఈ సందర్భంగా వివరించారు. దేశవ్యాప్తంగా పంటల సాగు, వాటికి రైతులు అనుసరిస్తున్న విధానాలు, స్థానిక పరిస్థితులు, ప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం, అదనంగా రైతుల అవసరాలు తదితర అంశాలను ఇందులో పొందుపరచాల్సి ఉంటుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ఫార్మర్స్ రిజిస్ట్రీలో రైతుల వివరాలను ఒక విశిష్ట సంఖ్యను కేటాయించి పొందుపరిచిందని తెలిపారు. ఇప్పటివరకు 1,30,425 మంది రైతులు ఇందులో నమోదు చేసుకున్నారని, మరో 30 వేల మందికి పైగా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉందన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ ఈ వివరాలను పూర్తిగా నమోదు చేయడంతో పాటు జిల్లాస్థాయి టాస్క్ ఫోర్స్ కమిటీ లోని వివిధ శాఖల మండల, నియోజకవర్గ, డివిజన్ స్థాయి అధికారులు కూడా ప్రత్యేకంగా సమావేశమై తమ ప్రాంతంలో రైతుల అవసరాలను గుర్తించాలన్నారు. జిల్లాలో అమలు చేస్తున్న ఉత్తమ విధానాలను కూడా ' ప్రగతి ' వెబ్ సైట్ లో పొందుపరచాలన్నారు. ఆయా విషయాలలో వ్యవసాయ రంగ నిపుణుల సలహాలు కూడా తీసుకోవాలని కలెక్టర్ చెప్పారు. కాగా, పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించిన రైతుల వివరాలను ఈ - పంట వివరాలతో సరిపోల్చాలని వ్యవసాయ అధికారులకు ఆయన దిశా నిర్దేశం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి గోపీచంద్, ఎల్.డి.ఎం రమేష్, ఇరిగేషన్ ఎస్.ఈ.వరలక్ష్మి, సిపిఓ సుధాకర్ రెడ్డి, డీఎస్ఓ పద్మశ్రీ, సెరికల్చర్ అధికారి సుజన్ కుమార్, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ హరికృష్ణ, మార్కెటింగ్ సహాయ సంచాలకులు వరలక్ష్మి, ఇతర అధికారులు పాల్గొన్నారు.