40 ఏళ్లుగా రోడ్డు నిర్మాణం ఊసేలేదు : హేమా సుదర్శన్
(రంగారెడ్డి - మేజర్ న్యూస్ ) : నాలుగు దశాబ్దాలుగా రోడ్డు నిర్మాణానికి నోచుకోని అత్తాపూర్ ప్రాంత సమస్యపై ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు హేమా సుదర్శన్ జిల్లోజు ఆందోళనకు దిగారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం అత్తాపూర్‌లోని పిల్లర్ నంబర్ 162, క్రోమా వెనుక నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు, ఓల్డ్ జలాల్ బాబా నగర్ రోడ్ మసీదు సమీపంలోని సుమారు రెండు కిలోమీటర్ల రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ రోడ్డుపైనే నిరాహార దీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో రోడ్డు నిర్మిస్తామని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ 15 ఏళ్లుగా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. గుంతలమయమైన రోడ్లు, డ్రైనేజీ సమస్యలు, దోమల బెడద, వీధి దీపాల కొరతతో స్థానికులు నిత్యం ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రహదారి సరిగ్గా లేకపోవడంతో ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని, ప్రజల భద్రతను పట్టించుకునే నాథుడే కరువయ్యారని మండిపడ్డారు.
ప్రజలకు కనీస మౌలిక సదుపాయమైన రహదారిని కూడా కల్పించలేని ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పదవిలో కొనసాగే నైతిక హక్కు కోల్పోయారని, వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులు స్పందించి రెండు కిలోమీటర్ల రోడ్డు నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించాలని కోరారు.
రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ సమస్య పరిష్కారం, వీధి దీపాల ఏర్పాటు చేపట్టాలని, అప్పటివరకు తమ నిరాహార దీక్ష, ప్రజా పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రజలకు రోడ్డు కావాలని, ఎన్నికల హామీలు కాదని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాయింట్ ట్రెజరర్లు జావిద్ షరీఫ్, కిసాన్ రింగ్ అధ్యక్షుడు నీరేటి ఆంజనేయులు, మైలార్‌దేవ్‌పల్లి ఇన్‌చార్జి డాక్టర్ మీర్జా బేగ్, రాష్ట్ర నాయకులు బాబూలాల్ పవర్, తేజాచార్య, అస్మత్‌తో పాటు అత్తాపూర్ మహిళా నాయకులు పాల్గొన్నారు.
వడ్ల శ్రీనివాస చారి : రంగారెడ్డి - మేజర్ న్యూస్