విద్యార్థుల ఆరోగ్య భద్రతపై పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లకు శిక్షణ
• ప్రథమ చికిత్స, సీపీఆర్, మానసిక ఆరోగ్యం, డ్రగ్స్ నివారణపై అవగాహన
సూర్య, మంచిర్యాల జిల్లా ప్రతినిధి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లకు విద్యార్థుల ఆరోగ్య భద్రత, అత్యవసర వైద్య సేవలపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. మంచిర్యాల బాలుర పాఠశాలలోని కుందన్ సమావేశ మందిరంలో నిర్వహించిన ఈ శిక్షణలో జిల్లాలోని సుమారు 50 మంది పీఈటీలు, ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటలు, క్రీడలు నిర్వహించే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు జరిగినప్పుడు అందించాల్సిన ప్రథమ చికిత్స విధానాలపై వైద్యులు అవగాహన కల్పించారు. పాఠశాలల్లో ప్రథమ చికిత్సకు అవసరమైన మందులు, వైద్య పరికరాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో అందుబాటులో ఉండే ఆసుపత్రులు, వైద్య సేవల వివరాలను వివరించారు. అదేవిధంగా విద్యార్థుల మానసిక ఆరోగ్యాన్ని గుర్తించడం, వారి ప్రవర్తనలో వచ్చే మార్పులను ముందుగానే పసిగట్టడం, మానసిక సమస్యలపై తగిన అవగాహన కల్పించడం వంటి అంశాలను వివరించారు. పొగాకు ఉత్పత్తుల వినియోగం, డ్రగ్స్‌కు దూరంగా ఉండటం, వాటి వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించాలని సూచించారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలను కాపాడేందుకు ఉపయోగపడే సీపీఆర్ (CPR) ప్రక్రియను వైద్య బృందం ప్రత్యక్షంగా ప్రదర్శించి శిక్షణ ఇచ్చింది. ఈ విధానంపై ఉపాధ్యాయులకు అవగాహన కల్పిస్తూ, పాఠశాలల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ నరేందర్ రాథోడ్ ఆదేశాల మేరకు వైద్య బృందాలు ఈ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించాయి. కార్యక్రమంలో జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ఆర్థోపెడిక్ వైద్యుడు డాక్టర్ రాజేష్ యాదవ్, మానసిక వైద్యుడు డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ సునీల్, కోర్సు కోఆర్డినేటర్ విజయలక్ష్మి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, అల్లాడి శ్రీనివాస్, కాకిరాల వెంకటేశ్వర్లు, లక్ష్మణస్వామి, కోర్సు కోఆర్డినేటర్లు, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.