బాల్యం నుంచే చట్టాలపై అవగాహన అవసరం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. సౌజన్య
సిద్దిపేట, ; బాల్యం నుంచే విద్యార్థులందరూ తమకు సంబంధించిన చట్టాలపై అవగాహన కలిగి ఉండడం అత్యంత ఆవశ్యకమని సిద్దిపేట జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. సౌజన్య అన్నారు. జాతీయ బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం దుద్దెడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు జి. రజిని అధ్యక్షతన ముందస్తుగా నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా సౌజన్య మాట్లాడుతూ ప్రతి విద్యార్థి బాలల న్యాయ పరిరక్షణ చట్టం, లైంగిక నేరాల నుంచి బాలల రక్షణ చట్టంపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని సూచించారు. ఈ రెండు చట్టాలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలను విద్యార్థులకు వివరించారు. అదేవిధంగా అంతర్జాలంలో జరిగే మోసాలు, సైబర్ నేరాలు, అనుచిత పరిణామాల గురించి అవగాహన కల్పించారు.ప్రతి ఒక్కరికీ హక్కులతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని, ఈ విషయాన్ని విద్యార్థులు గుర్తుంచుకోవాలని అన్నారు. తమ పరిసరాల్లో ఎక్కడైనా అన్యాయం జరిగినప్పుడు ఏమాత్రం భయపడకుండా సంబంధిత అధికారులకు తెలియజేయడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. పాఠశాలలో చదువుతోపాటు క్రమశిక్షణను అలవర్చుకోవాలని, స్వీయ రక్షణకు సంబంధించిన మెలకువలు నేర్చుకోవాలని సూచించారు.విద్యార్థులు అంతర్జాలం, సెల్‌ఫోన్లలో ఎక్కువ సమయం గడపకుండా ప్రతిరోజూ తప్పనిసరిగా ఆటలు ఆడాలని సూచించారు. చదువులో రాణించడంతోపాటు సమాజానికి ఉపయోగపడే గొప్ప పనులు చేయాలని ఆకాంక్షించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించుకొని భావితరాలకు కాలుష్య రహిత ప్రపంచాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.సైబర్ నేరాలకు గురైనప్పుడు వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేయాలని, ఉచిత న్యాయ సలహాలు, సహాయం కోసం 15100 టోల్‌ఫ్రీ నంబర్‌ను నిర్భయంగా సంప్రదించవచ్చని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థులందరికీ జాతీయ బాలల దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.అనంతరం బాలికల స్వీయ రక్షణ ఆవశ్యకతను తెలియజేస్తూ పాఠశాల విద్యార్థులు ప్రదర్శించిన నృత్య కార్యక్రమాన్ని వీక్షించి అభినందించారు. విద్యార్థులు స్వయంగా తయారుచేసి అందించిన పుష్పగుచ్ఛాన్ని స్వీకరించి వారిని అభినందించారు.ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు బాలయ్య, పాఠశాల ఉపాధ్యాయులు, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి తప్పెట్ల యాదగిరి, ఉపాధ్యాయ బృందం, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.