గ్రామ పంచాయతీ ఎన్నికల వ్యయ నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
విజయవాడ, మేజర్ న్యూస్ : ఎన్టీఆర్ జిల్లాలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛగా, నిష్పాక్షికంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఎన్నికల వ్యయ నిర్వహణకు సంబంధించిన నిబంధనలను అధికారులు కచ్చితంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు బి.విజయ్ కుమార్ సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా రిటర్నింగ్ అధికారులకు రెండవ దశ బ్రీఫింగ్ సమావేశం శనివారం విజయవాడలోని ఇరిగేషన్ శాఖ సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఎన్నికల వ్యయ నిర్వహణ, పర్యవేక్షణ, నిఘా బృందాల విధులు తదితర అంశాలపై అధికారులకు సమగ్రంగా దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థి రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్దేశించిన వ్యయ పరిమితికి లోబడి మాత్రమే ఖర్చు చేయాలని స్పష్టం చేశారు. అభ్యర్థులకు వ్యయ పరిమితిపై ముందుగానే అవగాహన కల్పించడంతో పాటు, ఎన్నికల ప్రచారానికి సంబంధించిన ప్రతి ఖర్చును నిర్ణీత నమూనాలో నమోదు చేసేలా చూడాలని రిటర్నింగ్ అధికారులకు సూచించారు. అభ్యర్థులు తమ రోజువారీ ఎన్నికల వ్యయ రిజిస్టర్లను నిర్ణీత సమయాల్లో అకౌంటింగ్ బృందాలకు సమర్పించేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. అభ్యర్థుల వ్యయ వివరాలను క్రమం తప్పకుండా పరిశీలించి, రికార్డులను సక్రమంగా నిర్వహించేలా చూడాలన్నారు. ప్రతి అభ్యర్థికి సంబంధించిన షాడో రిజిస్టర్లను అకౌంటింగ్ బృందాలు తప్పనిసరిగా నిర్వహించాలని, వ్యయ నివేదికలు సమర్పించని అభ్యర్థులకు నిబంధనల ప్రకారం తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఎన్నికల ర్యాలీలు, బహిరంగ సభలు, సమావేశాలు, ప్రచార వాహనాల వినియోగానికి సంబంధిత అధికారుల నుంచి ముందస్తు అనుమతులు పొందాలని అభ్యర్థులకు స్పష్టంగా తెలియజేయాలన్నారు. మంజూరు చేసిన అనుమతుల వివరాలను వీడియో సర్వైలెన్స్, అకౌంటింగ్ బృందాలకు అందజేసి, వాస్తవంగా జరిగిన ఖర్చులను నమోదు చేసిన వ్యయ వివరాలతో సరిపోల్చాలని సూచించారు. అనుమతులు లేకుండా నిర్వహించే కార్యక్రమాలపై ఎన్నికల నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు నగదు, మద్యం, కానుకలు పంపిణీ చేయడం వంటి నిషేధిత చర్యలను అరికట్టేందుకు ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వైలెన్స్, వీడియో సర్వైలెన్స్ బృందాలు అప్రమత్తంగా పనిచేయాలని ఆదేశించారు. ఎన్నికల నియమావళి ఉల్లంఘనలను గుర్తించిన వెంటనే సంబంధిత నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం అన్ని నిఘా బృందాలు, అకౌంటింగ్ బృందాలు, ఎన్నికల వ్యయ నిర్వహణ యంత్రాంగం పనితీరును సహాయ ఎన్నికల వ్యయ పరిశీలకులు నిరంతరం పర్యవేక్షించాలని తెలిపారు. ఎన్నికల వ్యయానికి సంబంధించిన ప్రతి అంశంలో పారదర్శకత, జవాబుదారీతనం పాటించాలని సూచించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవకతవకలకు తావులేకుండా, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేస్తూ విధులు నిర్వహించాలని రిటర్నింగ్ అధికారులకు జిల్లా ఎన్నికల వ్యయ పరిశీలకులు సూచించారు. ఈ బ్రీఫింగ్ సమావేశంలో జిల్లాలోని రిటర్నింగ్ అధికారులు పాల్గొన్నారు.
స్టాఫ్ రిపోర్టర్: ✍️ ప్రేమ్ రాజ్, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా.