ఖైదీలకు వృత్తి విద్య.. చర్లపల్లి జైలులో ప్రభుత్వ ఐటీఐని ప్రారంభించిన జైళ్ల శాఖ డిజి
చర్లపల్లి: నవంబర్ 13 .ఖైదీల్లో నైపుణ్యాభివృద్ధి, విద్యాభివృద్ధితో పాటు వారిని సమాజంలో గౌరవప్రదమైన పౌరులుగా తీర్చిదిద్దేందుకు తెలంగాణ జైళ్ల శాఖ మరో ముందడుగు వేసింది. చర్లపల్లి కేంద్ర కారాగారంలో ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐటీఐ)ను ఏర్పాటు చేసింది. రాష్ట్ర జైళ్ల శాఖ డైరెక్టర్ జనరల్ డాక్టర్ సౌమ్య మిశ్రా, ఐపీఎస్ ఈ సంస్థను ప్రారంభించారు. కార్మిక, ఉపాధి, శిక్షణ, కర్మాగారాల శాఖ ప్రభుత్వ కార్యదర్శి హరిచందన దాసరి, ఉపాధి, శిక్షణ శాఖ సంచాలకురాలు ఎ.క్రాంతి వెస్లీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
### తొమ్మిది వృత్తి విద్యా కోర్సులు
తెలంగాణ జైళ్ల శాఖ పరిధిలో ప్రభుత్వ ఐటీఐ ఏర్పాటు చేయడం ఇదే తొలిసారి. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వ శిక్షణ సంస్థ నుంచి తొమ్మిది వృత్తి విద్యా కోర్సులకు సూత్రప్రాయ ఆమోదం లభించింది. ఒక్కో విడతలో 200 మందికి శిక్షణ అందించేలా ఏర్పాట్లు చేశారు. ఫిట్టర్, పెయింటర్, నేత పనుల సాంకేతిక శిక్షణ, చెక్క పనులు, వెల్డింగ్, దుస్తుల తయారీ, గృహ నిర్వహణ, ఉద్యానవనం, పూల మొక్కల పెంపకం, తోటల రూపకల్పన తదితర కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ఇందుకోసం తొమ్మిది మంది నైపుణ్యం కలిగిన శిక్షకులను అందుబాటులో ఉంచారు.
### ఇప్పటికే 200 మంది ఆసక్తి
ఐటీఐ ప్రారంభోత్సవంలో తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ డీజీ డాక్టర్ సౌమ్య మిశ్రా మాట్లాడుతూ.. ఖైదీలకు విద్యతోపాటు వృత్తి నైపుణ్యాలను అందించడం ద్వారా వారి జీవితాల్లో సానుకూల మార్పు తీసుకురావచ్చని తెలిపారు. ఇప్పటికే సుమారు 200 మంది ఖైదీలు ఐటీఐ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపినట్లు వెల్లడించారు. జైళ్లను కేవలం నిర్బంధ కేంద్రాలుగా కాకుండా విద్య, నైపుణ్యాభివృద్ధి, పునరావాస కేంద్రాలుగా తీర్చిదిద్దడమే లక్ష్యమన్నారు.
### పదో తరగతిలో 78 మంది ఉత్తీర్ణత
ఖైదీల విద్యాభివృద్ధికి కూడా ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతున్నట్లు సౌమ్య మిశ్రా తెలిపారు. జాతీయ సార్వత్రిక విద్యా సంస్థ ద్వారా ఇటీవల 78 మంది ఖైదీలు పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులయ్యారని వెల్లడించారు. తెలంగాణ సార్వత్రిక విద్యా సొసైటీతో ఒప్పందం అనంతరం మరో 70 మంది పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరినట్లు వివరించారు. విద్యను కొనసాగించాలనుకునే ఖైదీలను వృత్తి విద్య వైపు కూడా ప్రోత్సహిస్తామని పేర్కొన్నారు.
### ఉపాధి అవకాశాలకు దోహదం
ప్రభుత్వ కార్యదర్శి దాసరి హరిచందన మాట్లాడుతూ.. ఖైదీలకు గుర్తింపు పొందిన వృత్తి విద్యా కోర్సుల్లో శిక్షణ అందించడం వల్ల విడుదల అనంతరం ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. నేర్చుకున్న నైపుణ్యాలతో దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఉపాధి, శిక్షణ శాఖ సంచాలకురాలు క్రాంతి వెస్లీ మాట్లాడుతూ.. ఐటీఐ శిక్షణను శిక్షలో భాగంగా కాకుండా జీవితాన్ని మార్చుకునేందుకు లభించిన అవకాశంగా భావించాలని ఖైదీలకు సూచించారు. శిక్షణ ద్వారా ఆచరణాత్మక నైపుణ్యాలను పెంపొందించుకుని విడుదల అనంతరం గౌరవప్రదమైన జీవితాన్ని గడిపేందుకు సిద్ధం కావాలన్నారు. జైళ్ల శాఖ హైదరాబాద్ రేంజ్ డీఐజీ ఎం సంపత్ మాట్లాడుతూ ఖైదీలకు ఐటిఐ ని ప్రారంభించడం వల్ల వృత్తి విద్యా కోర్సులకు అర్హులవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఖైదీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని సంపత్ వెల్లడించారు..
ఈ కార్యక్రమంలో జైళ్ల శాఖ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఎన్.మురళీబాబు, వరంగల్ రేంజ్ డీఐజీ డాక్టర్ డి.శ్రీనివాస్, చర్లపల్లి కేంద్ర కారాగారం సూపరింటెండెంట్ జి.ప్రమోద్, పరిశ్రమల శాఖ ఉప సంచాలకుడు ఎస్.డి.ఖలీద్ అక్తర్, ఎస్‌ఐసీఏ ప్రిన్సిపాల్ ఎస్.శ్రీనివాసరెడ్డి, చర్లపల్లి ఖైదీల వ్యవసాయ క్షేత్రం జైలు సూపరింటెండెంట్ పి.అశోక్, కుమార్ జైలర్. శ్రీనివాస్. డిప్యూటీ జైలర్. వై వెంకట్ రెడ్డి.ఇతర అధికారులు, సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.