బిల్లులు చెల్లించకుంటే పనులు బంద్.. టెండర్లకూ దూరం!
2017 నుంచి పెండింగ్‌లోనే కాంట్రాక్టర్ల బిల్లులు.. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యలే శరణ్యమంటున్న వైనం -భద్రాద్రి కొత్తగూడెం జిల్లా
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ : ప్రభుత్వ పనులు చేసి ఏళ్లు గడుస్తున్నా బిల్లులు చెల్లించకపోవడంతో కాంట్రాక్టర్లు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోతున్నారు. 2017 నుంచి పెండింగ్‌లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాంట్రాక్టర్ల అసోసియేషన్ కలెక్టర్‌ను కోరింది. బిల్లులు చెల్లించకపోతే నవంబర్ 14 నుంచి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో జరుగుతున్న పనులను నిలిపివేస్తామని, కొత్త పనులకు టెండర్లు వేయబోమని హెచ్చరించింది.
పాల్వంచలోని పెద్దమాతల్లి ఫంక్షన్ హాల్‌లో సమావేశమైన కాంట్రాక్టర్లు తమ సమస్యలపై చర్చించి జిల్లా కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో చిన్నచిన్న కాంట్రాక్టు పనులు చేపట్టి పూర్తి చేసినప్పటికీ, వాటికి సంబంధించిన బిల్లులు ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
బిల్లుల చెల్లింపులు లేక అప్పులు పెరిగిపోయి ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని తెలిపారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆత్మహత్యలే శరణ్యమయ్యే దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం తక్షణమే స్పందించి పెండింగ్ బిల్లులన్నింటినీ విడుదల చేసి తమ కుటుంబాలను, తమ ప్రాణాలను కాపాడాలని విజ్ఞప్తి చేశారు. లేనిపక్షంలో ఈ నెల 14 నుంచి పనులు నిలిపివేయడంతో పాటు కొత్త టెండర్లలో పాల్గొనబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే తమ సమస్యకు పరిష్కారం చూపాలని కాంట్రాక్టర్లు డిమాండ్ చేశారు.