పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం
సూర్య స్టేట్ బ్యూరో.
జిల్లాలో గ్రామ పంచాయతీ సాధారణ ఎన్నికలను ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందని కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి .పి.రాజాబాబు తెలిపారు. శుక్రవారం ప్రకాశం భవనంలోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ .వి.హర్షవర్ధన్ రాజు, డిఆర్ఓ పి.వి. రమణ, డిపిఓ అనుపమ, జడ్పీ సీఈవో చిరంజీవిలతో కలిసి ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వెల్లడించారు.
జిల్లాలోని 3 డివిజన్లు, 27 మండలాల పరిధిలో మొత్తం 519 పంచాయతీలు ఉండగా, దాసరివారిపాలెం విలీనంతో నికరంగా 518 పంచాయతీలు ఉన్నాయి. పదవీకాలం పూర్తికాని కొండపి మినహా, హైకోర్టులో కేసులు పెండింగ్‌లో ఉన్న మంగమూరు (ఎస్.ఎన్.పాడు), సర్వేరెడ్డిపాలెం (ఒంగోలు) పంచాయతీలను మినహాయించి 515 పంచాయతీల్లో (5,166 వార్డులు, 5,236 పోలింగ్ కేంద్రాలు) ఎన్నికలు జరగనున్నాయి.
ఓటర్ల జాబితా: జిల్లాలో మొత్తం 10,70,902 మంది ఓటర్లు ఉండగా, పురుషులు 5,30,738, మహిళా ఓటర్లు 5,40,138, ఇతరులు: 26 మంది ఉన్నారు.
మూడు విడతల్లో పోలింగ్…
మొదటి విడత (8 మండలాలు): ఒంగోలు, కొండపి నియోజకవర్గాల్లోని 139 పంచాయతీలు (1,434 పోలింగ్ కేంద్రాలు).
రెండవ విడత (10 మండలాలు): అద్దంకి, దర్శి నియోజకవర్గాల్లోని 198 పంచాయతీలు (2,014 పోలింగ్ కేంద్రాలు).
మూడవ విడత (9 మండలాలు): కందుకూరు, ఎస్.ఎన్.పాడు నియోజకవర్గాల్లోని 178 పంచాయతీలు (1,788 పోలింగ్ కేంద్రాలు).
మొదటి విడత పంచాయతీ ఎన్నికలకు ఈనెల 15 నుంచి 17 వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. 18వ తేదీన నామినేషన్ల పరిశీలన ఉంటుంది. నామినేషన్ల తిరస్కరణపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 19వ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు అప్పీలు చేసుకోవచ్చు. నామినేషన్ల ఉపసంహరణకు 21వ తేదీ మధ్యాహ్నం మూడు గంటల వరకు గడువు ఉంటుంది. అనంతరం అదే రోజు మూడు గంటల తరువాత పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. 26వ తేదీన ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ ఉంటుంది. అనంతరం అదేరోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి విజేతలను ప్రకటిస్తారు. ఎక్కడైనా రీపోలింగ్ అవసరమైతే 27వ తేదీన చేపడతామని కలెక్టర్ తెలిపారు.
ఏకగ్రీవాలకు భారీ నజరానా…
5వేల వరకు జనాభా ఉన్న గ్రామంలో ఎలాంటి ఎన్నిక జరగకుండా వార్డు మెంబర్లు, సర్పంచ్ ఏకగ్రీవమైతే రూ.15 లక్షల నజరానాను ప్రభుత్వం ప్రకటించింది. 5 వేల నుంచి పదివేల లోపు జనాభా ఉన్న గ్రామాలలో ఈ విధంగా ఏకగ్రీవమైతే రూ. 25 లక్షలు, జనాభా పదివేలకు పైగా ఉంటే రూ.50 లక్షల నజరానాను ప్రభుత్వం ప్రకటించిందని కలెక్టర్ తెలిపారు. ఈ నిధులను గ్రామ అభివృద్ధి కోసం ఖర్చు చేయవచ్చు అన్నారు.
అన్ని విడతలలో పంచాయతీ ఎన్నికలు ముగిసే డిసెంబర్ 4 తేదీ వరకు జిల్లావ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉంటుందని కలెక్టర్ తెలిపారు.
పటిష్ట భద్రతా ఏర్పాట్లు : ఎస్పీ
ఎస్పీ మాట్లాడుతూ 1,280 లొకేషన్లలోని 5,236 పోలింగ్ కేంద్రాలలో 808 సాధారణ, 275 సమస్యాత్మక, 197 అత్యంత సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని రాజకీయ పార్టీలు, అభ్యర్థులు ఖచ్చితంగా పాటించాలని ఆయన కోరారు. ఓటర్లు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
కలెక్టరేట్లోనూ మున్సిపల్ నామినేషన్లు..
కందుకూరు మున్సిపాలిటీకి ఈనెల 14వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని కలెక్టర్ తెలిపారు. ఇందుకోసం కందుకూరులోని తహసిల్దార్ కార్యాలయ ప్రాంగణం, పాలిటెక్నిక్ కాలేజీ ప్రాంగణంలో నామినేషన్లు సమర్పించవచ్చు అన్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశం మేరకు కలెక్టరేట్లో కూడా నామినేషన్లు స్వీకరించేందుకు ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈనెల 26వ తేదీన కందుకూరు మున్సిపాలిటీకి పోలింగ్ ఉంటుందన్నారు.