పోలీస్ సిబ్బంది సంక్షేమమే శాఖ ప్రాధాన్యం: ఎస్పి
గుంటూరు జిల్లా క్రైమ్, మేజర్ న్యూస్: గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రతి వారం నిర్వహించే "పోలీస్ సిబ్బంది గ్రీవెన్స్ డే" కార్యక్రమం శుక్రవారం జరిగింది. జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొని, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లు, విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది నుండి వ్యక్తిగత, సేవా సంబంధిత సమస్యలు, బదిలీలు, పదోన్నతులు, సెలవులు, వైద్య అవసరాలు మరియు ఇతర పరిపాలనా అంశాలకు సంబంధించిన వినతులను స్వీకరించారు.
ఈ సందర్భంగా ప్రతి వినతిని జిల్లా ఎస్పీ స్వయంగా పరిశీలించి, పోలీస్ శాఖ నిబంధనలకు అనుగుణంగా వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి జిల్లా పోలీస్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సిబ్బంది సమస్యలు సకాలంలో పరిష్కారమైతే విధి నిర్వహణలో మరింత సామర్థ్యం, నిబద్ధత, ఉత్సాహం పెరుగుతాయని పేర్కొన్నారు. బదిలీలు, పదోన్నతులు, ఇతర పరిపాలనా నిర్ణయాలు శాఖ నిబంధనలు, ఖాళీలు, పరిపాలనా అవసరాలను పరిగణనలోకి తీసుకుని పారదర్శకంగా చేపడతామని స్పష్టం చేశారు.పోలీస్ సిబ్బంది ఎలాంటి సంకోచం లేకుండా తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు. సిబ్బంది సంక్షేమం మెరుగుపడితేనే ప్రజలకు మరింత సమర్థవంతమైన, నాణ్యమైన పోలీసు సేవలు అందించగలమన్నారు. అదేవిధంగా ప్రతి పోలీస్ సిబ్బంది విధి నిర్వహణలో క్రమశిక్షణ, సమయపాలన, అంకితభావంతో వ్యవహరించాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా మెలుగుతూ పోలీస్ శాఖపై ప్రజల్లో విశ్వాసం, భద్రతాభావం మరింత పెంపొందేలా సేవలందించాలని సూచించారు.
ఆళ్ల వీరభద్రరావు, గుంటూరు జిల్లా ప్రతినిధి