కేజీబీవీ మైదుకూరులో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు
మైదుకూరు మేజర్ న్యూస్:మైదుకూరులోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో బాలల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో విద్యార్థినుల కోసం వివిధ ఆటల పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. వివిధ పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థినులకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఎస్. నసీం మునిషా బహుమతులను అందజేశారు. అంతేకాకుండా ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది సమష్టిగా పాఠశాలలోని విద్యార్థినులందరికీ బహుమతులు అందించి వారిని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఎస్. నసీం మునిషా మాట్లాడుతూ భారత తొలి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌లాల్ నెహ్రూకు బాలలంటే ఎంతో అభిమానమని, పిల్లలే దేశ భవిష్యత్తు అని ఆయన విశ్వసించేవారని తెలిపారు. విద్యార్థినులందరూ క్రమశిక్షణతో విద్యనభ్యసిస్తూ ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకోవాలని, పట్టుదలతో కృషి చేసి జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. చదువుతో పాటు ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొని తమలోని ప్రతిభను వెలికితీయాలని సూచించారు. ఈ వేడుకల్లో పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థినులందరూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆటపాటలు, బహుమతుల సందడి మధ్య పాఠశాల ఆవరణలో బాలల దినోత్సవ వేడుకలు ఆనందోత్సాహాలతో సాగాయి..