telangana
ఖేతు బచావో అభియాన్' అవగాహనా సదస్సు
సూర్య, వీణవంక:వీణవంక మండలంలోని ఎలబాక గ్రామంలో శుక్రవారం 'ఖేతు బచావో అభియాన్' కార్యక్రమంలో భాగంగా రైతులకు ప్రత్యేక అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామానికి చెందిన పలువురు ప్రముఖులు, అధికారులు, రైతులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సదస్సులో కేవీకే ప్రధాన శాస్త్రవేత్త విజయ్ ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు అమూల్యమైన సూచనలు చేశారు. రైతులు భూసారాన్ని పరిరక్షించుకుంటూ పంటలు పండించాలని ఆయన పిలుపునిచ్చారు. పశువుల పెంట, పచ్చిరొత్త ఎరువులను విరివిగా వాడి, రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గించాలని సూచించారు. ముఖ్యంగా వరిలో కొయ్యకాలు కాల్చడం వల్ల నేలలోని సూక్ష్మజీవులు నశించి జరిగే నష్టాలను ఆయన రైతులకు వివరించారు. రాబోయే యాసంగి సీజన్ లో నీరు, కరెంట్ లభ్యత తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున, తక్కువ నీటితో పండే ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సలహా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఈ శ్రీనివాస్, ఎంఏఓ గణేష్, ఏఈఓ శ్రావణ్, సర్పంచ్ నల్లగొని సరోజన, గ్రామ కార్యదర్శి ఇలోని శ్రీనివాస్, గ్రామానికి చెందిన పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.